Breaking News

భోగి పండుగ పర్యావరణహితంగా జరుపుకుందాం… : డా. పి.క్రిష్ణయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భోగి పండుగ అనేది ఆనందం, సంప్రదాయం, సంతోషాన్ని పంచుకునే పర్వదినం. మరి ఆ పండుగను పర్యావరణహితంగా జరుపుకుందాం – భోగి మంటల్లో ప్రమాదకర వ్యర్థాలు వేయకుండా పర్యావరణాన్ని కాపాడుకుందాం అని రాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి.క్రిష్ణయ్య. శీతాకాలంలో సాధారణంగా గాలిలో ధూళిరేణువులు నిలకడగా ఉండి పొగమంచు రూపంలో కొంత వరకూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనికి తోడుగా భోగి మంటలు వేయడం, వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండి గాలి నాణ్యత క్షీణిస్తుంటుంది. చాలామంది తెలిసీ తెలియక పండుగ సందర్భంగా మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, రంగులు వేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (E-waste) వంటి ప్రమాదకరమైన వస్తువులను వేస్తుంటారు. ఈ రకమైన వాటిని కాల్చినప్పుడు డయాక్సిన్లు, ఫ్యూరాన్లు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సీసం, క్యాడ్మియం, మెర్క్యురీ వంటి విషవాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. వీటి వల్ల పిన్నల నుంచీ పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ ప్రమాదకర వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, అలర్జీలు తీవ్రతరం కావడం, కళ్ల మంట, ముక్కు-గొంతు దురద, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వాటి బారినా పడే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఈ విషవాయువులు వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేసి, గాలి నాణ్యతను దిగజార్చడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు కూడా భంగం కలిగిస్తాయి. కాబట్టి ప్రజలందరూ భోగి మంటల్లో ప్లాస్టిక్, రబ్బరు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా రసాయన పూతలున్న వస్తువులను వేయకుండా కేవలం ఎండుటాకులు, కట్టెలు లేదా వ్యవసాయ వ్యర్థాలను మాత్రమే ఉపయోగించి భోగి పండుగను జరుపుకోవాలని కోరుతున్నారు డా.పి.క్రిష్ణయ్య. అదే విధంగా ఇంట్లోని పాత వ్యర్థాలను రోడ్ల మీద కాల్చకుండా, మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు అందజేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించగలరు… పండుగ ఆనందం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం కాకుండా ఉండేలా సహకరించాలని ప్రజలకు మనవి చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలి – ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు. ఇలాంటి ముందస్తు చర్యల ద్వారా గాలి కాలుష్యాన్ని నివారించడంతో పాటు ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అంటున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *