– సంప్రదాయ కళల సోయగంతో అలరిస్తున్న ఉత్సవాలు
– వినోదంలో విజ్ఞానాన్ని రంగరించి అందించిన కార్యక్రమాలు
– కళాకారులకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగుతున్న ఆవకాయ్.. అమరావతోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం నుంచి భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ వేడుకలు సందర్శకులకు కళా రుచితో పాటు జ్ఞానాన్నీ పంచాయి. కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కూడా పాల్గొని.. కళాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ‘కథా కాలక్షేపం – స్టోరీ అవర్’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా తెలుగు కథ చెప్పే కళ, భావవ్యక్తీకరణ, శ్రవణానందంతో పాటు ఆలోచనలకు పదును పెట్టే విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కథ చెప్పడం అనేది కేవలం వినోదం మాత్రమే కాకుండా, తరతరాలకు సంస్కృతి, విలువలు, జీవనతత్వాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమమని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. బాలల నుంచి పెద్దల వరకు అందరికీ ఆసక్తికరంగా రూపొందించిన కథనాలు విజ్ఞానాన్ని అందించాయి.
అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమాలు, నగాడా శిక్షణ శిబిరం నిరంతర ఉత్సాహంతో సాగి ప్రేక్షకుల్లో అపూర్వమైన ఉల్లాసాన్ని నింపాయి. భారతీయ సంప్రదాయ వాయిద్యాలలో నగాడాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సవాలు, జాతరలు వంటి కార్యక్రమాల్లో నగాడా వాయిద్యం శుభారంభానికి, శౌర్యానికి ప్రతీకగా వినిపిస్తుంది. గట్టిగా, గంభీరంగా మార్మోగే దీని ధ్వని ప్రజల్లో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. నగాడా వాయిద్యం, నైపుణ్యంతో కూడిన తాళబద్ధమైన లయతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వాయిద్య సంప్రదాయం భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదలో ఓ భాగం.
*ఉత్సవాల్లో భాగంగా పపెట్ మేకింగ్ చిన్నారులకు వినోదపు విందును అందించింది. ఈ బొమ్మల చరిత్ర, ప్రాధాన్యత, ముడి పదార్థాల ఎంపిక, డిజైన్ తయారీ, రంగుల వినియోగం, కదలికల అమరిక వంటి అంశాలపై నిపుణులచే సమగ్ర శిక్షణ అందించారు. సంప్రదాయ కళారూపమైన బొమ్మల కళను పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కళాత్మక కార్యక్రమాలు మన చారిత్రక వారసత్వ సంపద ఔన్నత్యాన్ని చాటిచెప్పడమే కాకుండా, సంప్రదాయ కళల పరిరక్షణలో యువత భాగస్వామ్యాన్ని చాటిచెప్పాయి. సంస్కృతి, సాహిత్యం, కళల సమన్వయంతో సాగుతున్న ఆవకాయ్ ఉత్సవాలు పర్యాటకులకు, నగర ప్రజలకు సరికొత్త అనుభవాన్ని అందించాయి.
Prajavartha Online Telugu News