రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం, జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు.
సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షా సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన అంశాలను జిల్లా అధికారులకు తెలియ జేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని, ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ సమస్యలు, లబ్ధిదారుల ఆధారిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, డిజిటల్ సేవల అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, సమస్యలను అక్కడికక్కడే గుర్తించి పరిష్కరించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి శాఖ తమకు అప్పగించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలతో నేరుగా మమేకమై పని చేయాలని అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News