రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగాల కోసం ఎదురు చూడే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే వాణిధర్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం లోని SKVT Government Degree College వాణిజ్యశాస్త్రం, అర్థశాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో “యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు – అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో తొలి రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవాణిధర్ రామన్ మాట్లాడుతూ, ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కేవలం వ్యాపారం కాదని, అది ఒక ఆలోచన, ధైర్యం మరియు సమాజపట్ల బాధ్యత అని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను వినియోగించి స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వి. తిరుపణ్యం మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులను ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. వారి అనుభవాలు యువతలో నూతన నైపుణ్యాలు, ఆవిష్కరణ దృక్పథం పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి అధికారి టీవీ సూర్యప్రకాష్ కీలక ఉపన్యాసం చేస్తూ, స్టార్టప్ సంస్కృతి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు ఉన్న అవకాశాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న పరిశ్రమల శాఖ సహ నిర్వహణ అధికారి జంగం చంద్రమౌళి గౌరవ అతిథిగా మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై భారత యువత ప్రతిభను చాటుకుంటోందని, ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సస్టైనబుల్ బిజినెస్ మోడల్స్ భవిష్యత్ వ్యాపార ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. ఏపీ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల బాలాజీ రుద్ర మాట్లాడుతూ, విద్యాసంస్థలు పరిశోధనలతో పాటు వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం అందించే కేంద్రాలుగా మారాలని కోరారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ అధికారి డాక్టర్ ఏ. జార్జి బాబు మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం కలయికే అభివృద్ధికి మూలస్థంభమని పేర్కొన్నారు. సదస్సు కన్వీనర్ కె. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైస్ స్వర్ణ శ్రీ, డాక్టర్ డివి రమణమూర్తి, జి శరత్ బాబు, డిడిఎస్ లక్ష్మి, బి చిరంజీవి, కే నీలకంటేశ్వరావు, కే శివప్రసాద్, కే దుర్గాబాబు, కే కరుణకుమారి, వి శివకృష్ణ, ఎం దివ్య తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News