గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రమైన పరిసరాలు మన లక్ష్యం, సంకల్పం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. “జీరో లిటర్ గవర్నెన్స్” థీమ్ తో ఈ నెలలో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద
మొక్కలు నాటారు. చెత్తను ఊడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛ రథం, గ్రీన్ అంబాసిడర్ లతో కలసి పాల్గొన్నారు. గ్రీన్ అంబాసిడర్ లు, స్వచ్ఛ కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి కార్మికులతో మాట్లాడారు. ఇ వేస్ట్ కలెక్షన్ కౌంటర్ ను సందర్శించి సేకరణ వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో వీధులను సందర్శించి అవగాహన కల్పించారు.
ఉన్నత పాఠశాల ఆవరణలో సేంద్రీయ ఎరువు గుంటకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాల కార్యక్రమంలో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర ఒకటన్నారు. ఇంటింటా సేంద్రీయ ఎరువు తయారు చేసే గుంటను ఉపాధి హామీలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర గా తీర్చిదిద్దుటకు
ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తుందని అందుకు మన వంతు సహకారం అందించాలని సూచించారు. ప్రజలు కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇళ్లు, వీధి, పాఠశాల, సమాజంలో పరిశుభ్రంగా ఉంచడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ ఉండాలన్నారు. పరిశుభ్రమైన సమాజం ఏర్పడితే ఆరోగ్యం వస్తుందని, తద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.
మన చుట్టుప్రక్కల పరిశుభ్రత ఉంచాలనే ఆలోచన అనునిత్యం ఉండాలని చెప్పారు. గ్రీన్ అంబాసిడర్ లను, పారిశుధ్య కార్మికులను గౌరవించాలని అన్నారు. చెత్తను చెత్త కుండీలోనే వేయాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయరాదని కోరారు. శుభ్రత సంకల్పం గొప్పగా ఉండాలని పిలుపునిచ్చారు.
జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ రథం ఇంటికి వస్తుంది, దానికి పొడి చెత్త తడి చెత్త వేరు చేస్తూ అందించాలని కోరారు.
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒక సేంద్రియ ఎరువు గుంటను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. 60 రోజుల నుండి 90 రోజుల్లో సేంద్రియ ఎరువులు తయారు అవుతాయన్నారు.
తొమ్మిదవ తరగతి చదువుతున్న పలకలూరి పూజిత స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్ర గురించి మాట్లాడారు పరిసరాలు పరిశుభ్రతపై వివరించారు.
పారిశుధ్య కార్మికులకు కిట్ లను పంపిణీ చేశారు. రహదారులు నిర్మించాలని స్థానికులు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు స్వప్న, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, మండల ప్రత్యేక అధికారి మరియు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, జెడ్పీటీసీ కందుల సిద్దయ్య, ఎం.పి.టి.సి
ఎం.సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News