మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
శనివారం నగరంలోని కలెక్టరేట్ సమీపంలో బాల భవన్ బ్యాడ్మింటన్ కోర్టు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ప్రాంగణంలోని చెత్తాచెదారాలను పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ కార్మికులు అందరితో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ చైర్మన్ ఫోటో దిగారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరి చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏదో ఒక చోట స్వయంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమం దాదాపు సంవత్సర కాలంగా జరుగుతుందన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరుగుతోందని ప్రశంసించారు. మచిలీపట్నం నగరం స్వచ్ఛత కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ ను, మునిసిపల్ కమిషనర్ను అభినందిస్తున్నామన్నారు.
రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో తప్పకుండా భాగస్వాములు కావాలన్నారు.
స్వచ్ఛమైన నీరు, గాలి వాతావరణం తోపాటు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. పర్యావరణంలో ఉండే కొన్ని బ్యాక్టీరియాలే రోగాలకు కారణమవుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2024 అక్టోబర్ 2 వ తేదీన మచిలీపట్నం లో జరిగిన స్వచ్ఛత కార్యక్రమం లో పాల్గొన్నారన్నారు. . దాదాపు లక్ష టన్నుల చెత్త పేరుకుపోయిందని దాన్ని దాదాపు శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఇంకా మిగిలింది కూడా ఒక నెల రోజుల లోపల తొలగించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రెండు కాంపాక్టర్ వాహనాలను కొనుగోలు చేశామని, రోజుకు 30 టన్నుల సామర్థ్యంతో చెత్తను తొలగించి గుంటూరుకు తరలించడం జరుగుతుందన్నారు.
ఒకవైపు ఉన్న చెత్తను తొలగించేందుకు ఏర్పాటు చేస్తూ భవిష్యత్తులో వచ్చే చెత్త కూడా పెరిగితే దాన్ని కూడా తొలగించేందుకు అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయుటకు కోన మార్గంలో 13 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు.
నగరంలో మురుగునీటి వ్యవస్థను బాగుపరచుటకు 13 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ నడుస్తుందని రెండు రోజుల్లో అది నిర్ధారణ జరిగి పనులు మొదలుపెడతామన్నారు.
మచిలీపట్నం ప్రస్తుతం కార్పొరేషన్ గా ఉందని మరిన్ని నిధులు సమకూర్చి మరింతగా అభివృద్ధి పరుచుటకు ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు.
మచిలీపట్నంలో సగభాగం సి ఆర్ డి ఏ పరిధిలోనూ మిగిలినది ముడా పరిధిలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు.
దేశంలో వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చెందిన ముంబై, కలకత్తా, చెన్నై వంటి నగరాలకు ఓడరేవు ఉందని అలాగే మన నూతన రాజధాని అమరావతికి మచిలీపట్నం ఓడరేవు ముఖద్వారంగా,( గేట్ వే ఆఫ్ అమరావతిగా) తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. అందుకు సంబంధించి సి ఆర్ డి ఏ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3 వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతినెలా ఒక ఇతివృత్తం(థీమ్) తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఈసారి జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్ అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని చేపట్టామని, దీని ప్రధాన ఉద్దేశం చెత్తాచెదారాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తబుట్టలోనే వేసే కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసి చైతన్య పరచాలన్నారు.
జిల్లాలో ప్రతి 3 వ శనివారం ఒక్కోసారి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బాల భవన్….బ్యాడ్మింటన్ కోర్టు ప్రాంగణంలో శుభ్రం చేస్తున్నామన్నారు.
బాల భవన్ సమీపంలో మురుగునీరు నిలబడిపోయి గుర్రపు డెక్క అంతా పెరిగిపోయిందన్నారు. ఈ విషయమై మంత్రి ఆ గుర్రపు డెక్క తొలగించాలని ఆదేశించారన్నారు.
అక్కడ పరిస్థితి పరిశీలిస్తే మురుగునీటి వ్యవస్థ సరిగా లేదని గుర్తించామని తగిన చర్యలు తీసుకొని కాలువ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
అంతేకాకుండా గుర్రపు డెక్కను తొలగించి ప్రహరీ నిర్మాణం కూడ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మంచి ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు.
ప్రతి నెల మూడో శనివారం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం బరువు అనుకోకుండా బాధ్యతగా భావించి పాల్గొనాలన్నారు.
జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి శనివారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సైకిల్ పైన గాని కాలినడకన గాని రావాలని తీర్మానం చేసుకున్నామని ఆ ప్రకారంగా కొన్ని వారాలుగా ఆ పద్ధతిని పాటిస్తున్నామన్నారు.
తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు.
అందరిలోనూ రాను రాను మార్పు వస్తుందని ఇది ఒక శుభ పరిణామం అన్నారు.
చాలామంది సైకిల్ పైన గాని, నడిచి రావడం జరుగుతుందన్నారు
అయినా కూడా కొంతమంది ద్విచక్ర వాహనంలో వచ్చి దూరంగా పార్కింగ్ చేసుకుని వస్తున్నారన్నారు.
అందరి మంచి కోసమే చెబుతున్నా
ఒక వయసు దాటాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లిన వ్యాయామం చేయాలని శరీర వ్యాయామం చేయకపోతే శరీరం రోగాల పుట్టగా తయారవుతుందనీ హెచ్చరించారు
మనం పీల్చే గాలి చాలా ముఖ్యమని అది స్వచ్ఛంగా ఉన్నప్పుడే అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు.
వాయు కాలుష్యం వలన పాఠశాలలు మూసివేసి ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇటీవల చాలా పత్రికలలో చదివే ఉంటారన్నారు గుర్తు చేశారు.
ప్రస్తుతము మచిలీపట్నం బాగుందని అది అలాగే కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ చిన్న చిన్నగా మన వంతు భాగస్వామ్యం ఉండాలన్నారు
ప్రతి కార్యక్రమానికి మంత్రివర్యులు వెన్నుగనుగా ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు వారికి జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
బుధవారం మంత్రితో కలిసి ఈ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కొంతమంది చాలా దూరం నుండి వస్తున్నామని ఈ సైకిల్ కావాలని కోరడంతో చాలా రాయితీ ధర 34 వేల రూపాయల నుండి 24 వేల రూపాయలకు తగ్గించి అమ్ముతున్నారని ఎవరైనా ఆసక్తి ఉంటే డిఆర్డిఏ పి.డి.కి వారి పేర్లను ఇచ్చిన పక్షంలో ఈసారి వచ్చే సైకిళ్లను ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు.
తదనంతరము ఇండోర్ స్టేడియంలో మంత్రి, కలెక్టరు కాసేపు ఆటవిడుపుగా షటిల్ బ్యాడ్మింటన్ ఎంతో చక్కగా ఆడి అందరిని ఆకర్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, జిల్లా ఖజానా అధికారి రవికుమార్,మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, డిఎస్డివో ఝాన్సీ లక్ష్మి, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఆర్డీవో పోతురాజు, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర ప్రసాద్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితర అధికారులు అనధికారులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News