-ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ తపాలా శాఖలో అంతర్భాగమై, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) ల అంకితభావాన్ని గుర్తిస్తూ, వారినిసన్మానించాలని కేంద్ర సమాచార మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ సంకల్పించారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్, ఫిబ్రవరి 22, 2026 న , గుంటూరులో భారీ ‘GDS సమ్మేళనం’ నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవలను సామాన్యుడి ముంగిటకి చేరుస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఈ వేదికపై ప్రత్యేక పురస్కారాలు అందించి సత్కరించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు తపాలా శాఖ ఉన్నతాధికారులు ఈ జీడిఎస్ సమ్మేళనంకు హాజరవుతారని తపాలా శాఖ ఒక ప్రకటన లో తెలియజేసింది. ఈ సమ్మేళనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న పోస్టల్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయడానికి, ఒక గొప్ప వేదికగా నిలవనుందని తపాలా శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని వివిధ విభాగాల నుండి సుమారు తొమ్మిది వేలమంది గ్రామీణ డాక్ సేవక్ లు ఈ సమ్మేళనానికి హాజరుకానున్నారు.ఈ సమ్మేళనం, గ్రామీణ ప్రాంతాల్లో విశిష్ట సేవలందిస్తున్న జిడిఎస్ లను ఉత్తేజ పరచటానికి దోహద పడుతుందని అందరూ భావిస్తున్నారు.
Prajavartha Online Telugu News