గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రబి – 2025 – 26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా రూ. 5,875/- ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. జిల్లా రైతులు శనగ పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులు పాటించవలసిన నియమాలు
శనగ పంట సాగు చేసిన రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో సి.యం యాప్ (CMAPP) లో నమోదు చేసుకోవాలన్నారు. నమోదుకు సాగు చేసిన రైతే తప్పనిసరిగా రైతుసేవా కేంద్రంకు వెళ్లి తమ బయోమెట్రిక్ వేయవలసివుంటుందని తెలిపారు.
నమోదు చేసిన రైతులకు ఉత్పత్తి పరిమాణం, తీసుకురావాల్సిన తేదీ, మోతాదు, కేంద్రం వివరాలు సంక్షిప్త సమాచారం ( SMS) ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు.
సంక్షిప్త సమాచారం (SMS) అందుకున్న రైతులు కేటాయించిన తేదీన సంబంధిత కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకురావాలన్నారు.
శనగ పంటను నూర్పిడి చేసి బాగా ఆరబెట్టి శుభ్రం చేయాలని సూచించారు.
తేమ శాతం 14% లోపు ఉండేలా ఆరబెట్టాలని అన్నారు.
ముందుగా ఖాళీ గోనె సంచులు ఇవ్వడం జరగదని తెలిపారు. రైతులు తమ సొంత గోనె సంచుల్లోనే పంటను తీసుకురావాలన్నారు.
నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న శనగలను తూకం వేసి, ఏపీ మార్క్ ఫెడ్ సరఫరా చేసిన కొత్త గోనె సంచుల్లో నింపడం జరుగుతుందని, రైతుల గోనె సంచులు రైతులకే తిరిగి ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
కొనుగోలు కేంద్రంలో లోడింగ్ వరకు అయ్యే ఖర్చును రైతులే భరించాలని స్పష్టం చేశారు.
శనగ పంట ఇ క్రాప్ (e-Crop) నమోదు అయి ఉండాలన్నారు. నమోదు చేసిన రైతుల నుండి మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబర్ (IFSC కోడ్‌తో), పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులు సమర్పించాలని పేర్కొన్నారు.
శనగ కొనుగోలుకు నాణ్యత ప్రమాణాలు
అత్యధిక పరిమితి శాతం
1.తేమ శాతం – 14%
2.ఇతర వ్యర్థ పదార్థాలు- 1%
3.ఇతర పంట గింజలు- 3%
4.దెబ్బతిన్న గింజలు- 3%
5.పాక్షికంగా దెబ్బతిన్న గింజలు-4%
6.రంగు మారిన / విరిగిన గింజలు -2%
7.పూర్తిగా తయారుకాని గింజలు – 6%
8.పురుగుపట్టిన గింజలు – 4%
కొనుగోలు పూర్తయిన తరువాత డబ్బులు ఆధార్‌కు లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News