గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్ ( ఏబీసి), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ కోసం సెంటర్ నిర్మాణపనులను వేగంగా చేపట్టాలని, ఇప్పటికే ఏజన్సీకి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చినందున పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం పొన్నూరు రోడ్ లో నిర్మాణంలోని ఏబీసి సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ సెంటర్లను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఏబీసి సెంటర్ పనులను నిర్దేశిత మార్గదర్శకాల మేరకు వేగంగా చేపట్టాలన్నారు. సెంటర్ లో ఏబీసి అనంతరం ఫీడింగ్ పాయింట్స్, నీరు, వైద్యులు, సిబ్బందికి విశ్రాంతి గదులు వేరువేరుగా నిర్మాణం చేయాలన్నారు. అలాగే నగరంలో వీధి కుక్కల సమస్యలపై ఫిర్యాదులు అందిన ప్రాంతాలను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరిశీలించాలన్నారు. ఎస్ఎస్ ల వారీగా వీధి కుక్కలకు ఫీడింగ్ జోన్ల ఏర్పాటు కోసం స్థలాలపై వివరాలు తీసుకోవాలని, వాటి మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పొన్నూరు రోడ్ లో జిఎంసి స్థలాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏసిపీని ఆదేశించారు. అనంతరం సుద్దపల్లి డొంకలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని పరిశీలించి, ప్లాంట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ లో ఉండాలన్నారు. నగరంలో మరమత్తుకు గురైన యుజిడి లైన్లపై నివేదిక ఇవ్వాలని ఎస్ఈని ఆదేశించారు. ఫీకల్ స్లెడ్జి ట్రీట్మెంట్ ప్లాంట్ ని పరిశీలించి, ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్లు రోడ్ల పక్కన వేయకుండా తప్పనిసరిగా ప్లాంట్ కే ఇచ్చేలా వారితో మాట్లాడాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ నుండి అవుట్ ఫాల్ డ్రైన్ కి సైడ్ వాల్ నిర్మాణం చేయాలన్నారు.
పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిసిపీ సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఈఈలు శ్రీనివాస్, సతీష్ కుమార్, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News