Breaking News

జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలి

-మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జనాభా లెక్కల నమోదు పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జనాభా లెక్కల సేకరణ – 2027 – ఇళ్ల జాబితా తయారీ, కుటుంబ జనాభా గణన అంశంపై జిల్లా, మున్సిపల్ కార్పొరేషన్, మండల స్థాయి అధికారుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయుటకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని, తద్వారా క్షేత్ర స్థాయి సిబ్బందికి మంచి తర్ఫీదు అందించవచ్చన్నారు. 2027లో నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 16వది కాగా స్వాతంత్ర్యం వచ్చాక 8వది మరియు ప్రపంచంలోనే పురాతన మైన జనాభా లెక్కల సేకరణ అని పేర్కొన్నారు.రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ), రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ) జరుగుతుందని తెలిపారు.ఈసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణకు ఒక ప్రత్యేకత ఉందని మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని చెప్పారు.

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ జనాభా గణన విజయవంతం అనేది అంకిత భావంతో పాల్గొనడంపై ఆధారపడి ఉంటుందన్నారు. డేటా సేకరణ కోసం నియమించే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సమర్థవంతమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు. డేటా సేకరణపై జనాభా లెక్కల విజయవంతం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

జనాభా లెక్కల కార్యనిర్వహణ అధికారి మరియు జాయింట్ డైరెక్టర్ జి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందుకు అనుగుణంగా మొబైల్ అప్లికేషన్, వెబ్ పోర్టల్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో ఖచ్చితమైన వివరాలతో కూడిన జనాభా లెక్కల సేకరణకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా జిల్లా కలక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక బాధ్యతగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు.

మొబైల్ యాప్‌లలో ఎన్యూమరేటర్ ద్వారా ఇంటింటికి వెళ్లి సొంత మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి లేదా స్వంత పరికరాన్ని తీసుకు వెళ్లి డేటా సేకరణ చేయడం జరుగుతుందన్నారు. ఇంటింటికి సందర్శన ద్వారా ఎన్యూమరేటర్ ధృవీకరించడం జరుగుతుందన్నారు. వెబ్ పోర్టల్ (CMMS) ద్వారా నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుందని, వెబ్ మ్యాపింగ్ యాప్ (HLBC) ద్వారా జియోకోడెడ్ హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
జన గణన ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు దశల్లో నిర్వహిస్తారని, మొదటి దశలో మొదటగా ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు గృహ పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఆస్తుల డేటాను తీసుకోవడం జరుగుతుందని, మే1 నుండి 30వ తేదీ వరకు ఇంటింటిని సందర్శించడం జరుగుతుందన్నారు. రెండవ దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి వ్యక్తుల వలస, సంతానోత్పత్తి, సామాజిక-సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై డేటా సేకరణ జరుగుతుందన్నారు. జన గణన అధికారి లేదా సహాయం చేయాల్సిన వ్యక్తి చట్టబద్ధమైన ఆదేశాలను పాటించాలన్నారు. జన గణన పనిని అడ్డుకోవడం, జన గణన అధికారుల దుష్ప్రవర్తన, అభ్యంతరకరమైన లేదా అనుచితమైన ప్రశ్నలు అడుగుతూ విధులకు ఆటంకపరచరాదని అన్నారు. జన గణన సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయరాదని, జన గణన రికార్డులను ట్యాంపర్ చేయడం, పత్రాలను తొలగించడం, దాచడం, దెబ్బతీయడం లేదా నాశనం చేయడం చట్ట రీత్యా నేరమని అన్నారు. ఆరుగురు ఎన్యూమరేటర్ల పనులను “సూపర్‌వైజర్” పర్యవేక్షిస్తారని చెప్పారు. జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించడానికి ఛార్జ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజల అవగాహన, సహకారాన్ని పొందడానికి తగిన సమయాల్లో జనాభా గణన కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎనిమిది వందల జనాభాను ఒక బ్లాక్ గా చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ,, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ బాషా, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి వి. ఆది లక్ష్మీ, శిక్షకులు సి. హెచ్.వి. రమణ, ఎం. స్వాతి, సమన్వయ అధికారి డి. రామ సుబ్బారావు, తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *