గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు, ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజా సౌకర్యార్ధం ప్రధాన రోడ్లఫై, డ్రైన్ ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే తొలగింపులో జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు నగరంలోని అమరావతి రోడ్, జిటి రోడ్ ల్లోని పలు ప్రాంతాల్లో 47 ఆక్రమణల తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యం, వివిధ ప్రజా సంఘాలు, ప్రజల నుమ్డియా అందిన ఫిర్యాదుల మేరకు ప్రధాన రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు చేపట్టామనంరు. ట్రాఫిక్ సమస్యలు ఎదురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని, తొలగించుకోని వాటిని నగరపాలక సంస్థ అక్రమ ఆక్రమణల నిర్మూలన దళం తొలగిస్తుందన్నారు. ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా చేపట్టాలని, తొలగించిన వాటి వివరాలను రోజువారీ నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశామన్నారు. ప్రజా సౌకర్యార్ధం ఆక్రమణదారులు నగరపాలక సంస్థకు సహకరించి, ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని కోరారు.
అలాగే నగరంలో విచ్చలవిడిగా డివైడర్లు, రోడ్లపై, విద్యుత్ స్థంబాలకు ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారని, అటువంటి వారిపై అపరాధ రుసుంలు విధించనున్నామన్నారు. అనధికారిక బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం వారు నగరంలో అనధికారిక ఫ్లెక్సీలను తొలగించి, భాధ్యులను గుర్తించాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News