గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
జిఎంసికి పన్ను బకాయిదారుల వివరాలతో నగరంలో ప్రదర్శన బోర్డ్ లు ఏర్పాటు…. కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు నగరపాలక సంస్థ డిమాండ్ నోటీసులు అందించినప్పటికీ స్పందించని, ఖాళీ స్థల బకాయిదారులకు గురువారం నుండి చెల్లించాల్సిన బకాయి వివరాలతో కూడిన ప్రదర్శన బోర్డ్ లను ఆయా యజమానుల స్థలాల్లో ఏర్పాటు చేస్తున్నామని, అప్పటికీ స్పందించని యెడల ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ రెవెన్యూ వసూళ్ల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు దీర్ఘ కాలంగా రూ.80 కోట్లకు పైగా బకాయిల ఉన్నఖాళీ స్థల పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా అధిక మొత్తంలో బకాయిలున్న టాప్ 10 యజమానుల స్థలాల్లో బకాయిల పూర్తి వివరాలతో 100కు పైగా ప్రదర్శన బోర్డ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వసూళ్ల చట్ట ప్రకారం స్పందన లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నగరపాలక సంస్థకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తి పన్ను రూ.132 కోట్ల బకాయిలున్నాయని, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల ప్రతినిదులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామని, ప్రైవేట్ బకాయిదారులకు డిమాండ్ నోటీసులు, స్లిప్ లు పంపిణీ చేశామని తెలిపారు. నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తుల గోడలపై బకాయిల వివరాలను ప్రకటిస్తామన్నారు. కనుక బకాయిదారులు ప్రతి ఒక్కరూ మార్చి నెలాఖరు వరకు వేచి చూడకుండా బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే నీటి మీటర్ల డిమాండ్ కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశామని, వారం రోజుల వ్యవధిలో చార్జీలు చెల్లించని యెడల కుళాయిల డిస్ కనెక్షన్ చేస్తామని హెచ్చరించారు. నగరంలో డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయి ఉన్న వాణిజ్య సముదాయాల వారు ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాలని, లేకుంటే మార్చి 1వ తేదీ నుండి 25 శాతం అపరాధ రుసుం జమ అవుతుందని తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించడానికి క్యాష్ కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News