రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ మరియు రూరల్ మండలాల పరిధిలోని పిడింగొయ్య మరియు కోటిలింగాల గ్రామాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు తనిఖీ సందర్భంగా ధవళేశ్వరం ఇసుక ర్యాంపు నుండి రోటరీ కైలాస భూమి వరకు నదీ ప్రవాహంలో గట్టు సమీపంలోని KM 3.200 వద్ద డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక త్రవ్వకాల ఆనవాళ్లతో ఉన్న ఒక డ్రెడ్జింగ్ బోటును గుర్తించారు. అయితే ఆపరేటర్, యజమాని తదితరులు అందుబాటులో లేరు. స్థానిక విచారణలో అది ఏల్చూరు నివాసి యం. హరికృష్ణకు చెందినదిగా తెలిసిందన్నారు. అలాగే కోటిలింగాల డి-సిల్టేషన్ ఇసుక ర్యాంపు సమీపం లోని KM 11.900 వద్ద ఇసుక సక్కింగ్ మెషినరీతో కూడిన “ఇనవిల్లి వరసిద్ది వినాయక” అనే పేరుగల మరో బోటును గుర్తించారు. ఆపరేటర్, యజమాని తదితరులు అక్కడ లేరు. స్థానిక విచారణలో అది విజయవాడకు చెందిన రాకీకి చెందినదిగా తెలిసింది. ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా త్రవ్వడం పర్యావరణ నిబంధనలు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు దారి తీసినందున, పై రెండు బోట్లను జలవనరుల శాఖ ఏ.ఈ.కు తదుపరి చర్యల నిమిత్తం స్వాధీనం చేశారు. ఇసుక వెలికితీతకు డ్రెడ్జింగ్ బోట్లను వినియోగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో ఇసుక త్రవ్వకాల కోసం సక్కింగ్ మెషినరీ కలిగిన డ్రెడ్జింగ్ బోట్లను వినియోగించి నట్లయితే, సంబంధితులపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సంయుక్త తనిఖీలలో జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి, జలవనరుల శాఖ ఈ.ఈ. జి. శ్రీనివాసరావు, డి.ఈ. కే. ఆనందబాబు, ఏ.ఈ. శివ, గనులు మరియు భూగర్భ శాఖ సాంకేతిక సిబ్బంది మనీషా (టి.ఏ.), శైలజ (టి.ఏ.), జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సిబ్బంది యు.వి.వి. సత్యనారాయణ, ఎస్. సాయి కృష్ణ (హోం గార్డ్), రెవెన్యూ శాఖకు చెందిన వై. సత్యనారాయణ (వీఆర్ఓ, ధవళేశ్వరం), ఎస్. రామిరెడ్డి (వీఆర్ఓ, కోటిలింగాల వార్డు) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News