-మార్చి 18వ తేదీ లోగా దరఖాస్తులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా వ్యవహరించుటకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ విభాగాలలో అర్హులైన అభ్యర్ధుల నుండి మార్చి 18వ తేదీ లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
పారా లీగల్ వాలంటీర్లు (PLVలు), సామాన్య ప్రజలకు, న్యాయ సేవల సంస్థలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించే వారధి వంటి వారని చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థలు పి.ఎల్.వి (PLV) లకు చట్టాలు, న్యాయ వ్యవస్థపై శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తాయన్నారు. పార్టీల మధ్య ఉన్న సాధారణ వివాదాలను మూలం వద్దనే పరిష్కరించుకోవడానికి, న్యాయ సేవాధికార సంస్థ /ఏడీఆర్ కేంద్రాలకు వెళ్లేవారి ఇబ్బందులను, సమయాన్ని ఆదా చేసేందుకు కూడా శిక్షణనిస్తారని వివరించారు. పారా లీగల్ వాలంటీర్లు (PLVలు) సహాయంతో మూలం వద్ద పరిష్కరించలేని వివాదమైతే వారు అటువంటి పార్టీలను ఎడిఆర్ కేంద్రాలకు తీసుకురావచ్చని, అక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సహాయంతో దానిని మధ్యవర్తిత్వానికి సూచించవచ్చని తద్వారా సమస్య స్వభావాన్ని చట్టపరమైన సహాయ న్యాయస్థానంలో తీర్పు అందించడం జరుగుతుందని చెప్పారు. పారా లీగల్ వాలంటీర్లుగా వారి సేవలకు ఎటువంటి ఆదాయము ఆశించరాదని పేర్కొన్నారు.
పారా లీగల్ వాలంటీర్లు (PLVలు) ఎంపిక కోసం మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులై ఉండాలని, సంపూర్ణ గ్రహణశక్తితో మంచి ఆరోగ్యం కలిగి, సమాజంలోని నిరుపేదలకు సహాయం చేసే మనస్సును కలిగి ఉండాలని వివరించారు. సమాజంలో అట్టడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రద్ధ వహించాలని సూచించారు.
*పారా లీగల్ వాలంటీర్లుగా ఎంపిక చేయగల సమూహం….
1. ఉపాధ్యాయులు (విశ్రాంత ఉపాధ్యాయులతో సహా)
2. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు సీనియర్ సిటిజన్లు.
3. ఎం.ఎస్.డబ్ల్యు (M.S.W) విద్యార్థులు, ఉపాధ్యాయులు
4. అంగన్వాడీ కార్యకర్తలు
5. వైద్యులు.
6. విద్యార్థులు, లా విద్యార్థులు
పారా లీగల్ వాలంటీర్లుగా ఎంపికకు అర్హులని తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కమిటీ వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
అర్హులైన అభ్యర్ధులు తమ పూర్తి వివరాలు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తో కలిగిన బయో డేటా, ఇటీవల తీసుకున్న ఫోటో, మెట్రిక్యూలేషన్ కాపీని (ఎస్.ఎస్.సి), కులధ్రువీకరణ పత్రం (if applicable) కాపీని జతచేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పోస్ట్ ద్వారా / వ్యక్తి ద్వారా / ఫైలింగ్ బాక్స్ ద్వారా మార్చి 18వ తేదీ లోగా దరఖాస్తులు అందజేయవచ్చని చెప్పారు.
Prajavartha Online Telugu News