న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ కళాకారుల ఉపాధి, ఆదాయ స్థిరత్వం లాంటి పలు అంశాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. గ్రామ పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కింద చేతితో తయారు చేసే ఆభరణాలు, అలంకరణ వస్తువులను ప్రత్యేక భాగంగా చేర్చే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కచ్ ప్రాంతానికి చెందిన వెండి ఆభరణాలు, బస్తర్ ప్రాంతానికి చెందిన ధోక్రా కళాఖండాలు, లాక్ ఆభరణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎటికొప్పాక బొమ్మలు, పశ్చిమ బెంగాల్ పురులియా ప్రాంతంలోని సంతాల్ మహిళలు తయారు చేసే టెర్రాకోట ఆభరణాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ పథకంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తారా అని గురుమూర్తి ప్రశ్నించారు. అదేవిధంగా ఈ కళాకారులకు మార్కెట్ అనుసంధానం కల్పించడం, వారి ఆదాయం స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకునే ప్రతిపాదనలు ఉన్నాయా అని కూడా కేంద్రాన్ని కోరారు.
ఈ ప్రశ్నకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో సమాదనం ఇచ్చారు. గ్రామ పరిశ్రమల అభివృద్ధి కోసం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా గ్రామ ఉద్యోగ వికాస్ యోజన అమలు అవుతోందని ఆమె తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ, సంప్రదాయ కళాకారులకు శిక్షణ అందించడం, అవసరమైన పనిముట్లు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు, వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, వెల్నెస్, కాస్మెటిక్స్ పరిశ్రమలు, చేతితో తయారు చేసే కాగితం, లెదర్, ప్లాస్టిక్ పరిశ్రమలు, గ్రామీణ ఇంజినీరింగ్, నూతన సాంకేతిక పరిశ్రమలు, సేవా రంగం వంటి విభాగాల కింద ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అయితే ప్రస్తుతం కచ్ వెండి ఆభరణాలు, బస్తర్ ధోక్రా కళాఖండాలు, లాక్ ఆభరణాలు, ఎటికొప్పాక వస్తువులు, పురులియాలో సంతాల్ మహిళలు తయారు చేసే టెర్రాకోట ఆభరణాలను ప్రత్యేక విభాగంగా చేర్చే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News