అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యునైటెడ్ స్టేట్స్ అమెరికా (యుఎస్‌ఎ)లోని న్యూజెర్సీలో హైస్కూలు విద్యను అభ్యసిస్తున్న విజయవాడకు చెందిన యువకుడు భాను కౌశిక్ మక్కపాటి అద్వితీయ ప్రతిభను కనబర్చారు. ఆ దేశంలో ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ అమెరికా (ఎఫ్‌బిఎల్‌ఎ) వేదికగా ‘ఫ్యూచర్ బిజినెస్ ట్రెండ్స్’ అంశంపై నిర్వహించిన సెమినార్‌లో కౌశిక్ ప్రదర్శించిన ప్రజెంటేషన్‌కు మొదటి బహుమతి లభించింది. భవిష్యత్తు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ మారుతున్న సమాజంలో డిజిటల్ టెక్నాలజీ, మార్కెటింగ్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ వంటి అంశాలపైనా సోధాహరణంగా వివరించారు. వ్యాపార అంశాలపై సరికొత్తగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. త్వరగా సంపాదించాలంటే మాత్రం వ్యాపారం కంటే మంచి మార్గం మరొకటి లేదు. చిన్నదైనా, పెద్దదైనా వ్యాపారం చేసే ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిజాయతీగా, ప్రణాళికా ప్రకారం ముందుకు సాగితే వ్యాపారంలో త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఒకప్పుడు చిన్న వ్యాపారంగా మొదలు పెట్టినవే. అయితే సొంతంగా బిజినెస్ మొదలుపెట్టడం కష్టమనిపించినా కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాణించొచ్చు. మార్కెట్ రీసెర్చ్, బిజినెస్ స్ట్రక్చర్‌పై సమగ్రంగా తెలిసుండాల్సిందే. వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత.. విస్తరించడం గురించి ఆలోచించండి. ప్రాథమిక అంశాలు దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపార విస్తరణ మంచి ఫలితాలనిస్తుంది’ అనే విషయాలను సోధాహరణంగా వివరాలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చారు. భాను కౌశిక్ అద్వితీయ ప్రతిభను ఎఫ్‌బిఎల్‌ఎ ప్రతినిధులు అభినందిస్తూ సన్మానించారు. అమెరికాలోని పలువురు ప్రవాసభారతీయులు సైతం భాను కౌశిక్‌కు అభినందనలు తెలియజేశారు. విజయవాడకు చెందిన ప్రముఖులు కె.వెంకటప్పయ్య రెండో కుమార్తె కుమారుడు భాను కౌశిక్. ఆయన తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, శివమూర్తి. చదువులో చురుగ్గా ఉండే కౌశిక్ మంచి వక్త కూడానూ. ఆట, పాటల్లో చురుగ్గా పాల్గంటాడు. క్రికెట్ ఆటలో మంచి ప్రావీణ్యం ఉంది. పలు బహుమతులు సైతం గెల్చుకున్నాడు. భాను కౌశిక్‌కు ఆశ్రిత, ఆరాధ్య ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. వీరు కూడా చదువులో బాగా రాణిస్తున్నారు. తన మనువడు అమెరికాలో విశిష్టమైన గౌరవాన్ని అందుకోవటం పట్ల తాత కె.వెంకటప్పయ్య సంతోషాన్ని వ్యక్తంచేశారు.
Prajavartha Online Telugu News