గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు మహోన్నతమైన వ్యక్తి అని గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. సోమవారం పొట్టిశ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి యార్లగడ్డ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన 58 అడుగుల పొట్టిశ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఇంతటి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆ మహానుభావుడికి దక్కిన నిజమైన గౌరవమని అన్నారు. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే వంటి జాతీయ నాయకులు మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకతను గుర్తించారని, అదే స్ఫూర్తితో ఆంధ్రరాష్ట్ర సాధన కోసం కృష్ణా జిల్లాకు చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, నందమూరులో జన్మించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వంటి ఎందరో మేధావులు కృషి చేశారని గుర్తు చేశారు. 1906లోనే మచిలీపట్నం వేదికగా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను పట్టాభి సీతారామయ్య తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రాణత్యాగం చేస్తే తప్ప లక్ష్యం సిద్ధించదని భావించిన పొట్టి శ్రీరాములు, 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన బలిదానంతో తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి కారణమయ్యారని చెప్పారు. ఆయన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాదని, నేడు దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయనే ఆద్యుడని కొనియాడారు. ఈ విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని ‘స్టాచూ ఆఫ్ లిబర్టీ’ తరహాలో దీనికి స్టాచూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టిన మంత్రి లోకేష్ ను అభినందించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తెలుగు జాతి మొత్తం ఆయనను గౌరవించుకున్నట్లవుతుందని సూచించారు. అనంతరం ప్రజా దర్బార్ లో ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల పరిష్కారాలపై అన్ని శాఖల ల అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 7,900 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంతో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ఇంకా మిగిలి ఉన్న 10 శాతం పెండింగ్ కేసులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించబోమని, ప్రజలకు వేగంగా సేవలు అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధియే తన లక్ష్యమని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షాహిద్ బాబు, అన్ని శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News