మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి పామర్రు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో చల్లపల్లి రహదారికి సమీపంలోని పామర్రులో టిడ్కో గృహాల నిర్మాణానికి ప్రతిపాదనను శాసనసభ్యుడు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అర్హులైన లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొవ్వలో మార్కెట్ యార్డు నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్నాయని, స్థలం మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరగా, అనువైన స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో అంగన్వాడి కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, ఆయా భవనాలను పూర్తి చేసేందుకు సి ఎస్ ఆర్ నిధులను మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. స్థానిక బెల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సి ఎస్ ఆర్ నిధులు సమకూరుస్తామన్నారు.
పామర్రు పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, పట్టణం మీదగా వెళ్ళిన పైపులైనుకు అదనంగా మరో రెండు గంటలు నీరు ఇవ్వాలని కోరగా, జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. నియోజకవర్గంలో గ్రామాలను కలిపే రహదారుల అభివృద్ధిపై తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అనంతరం ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లోని అంతర్గత రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమావేశంలో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, టిడ్కో ప్రాజెక్ట్ మేనేజర్ చిన్నోడు, గృహ నిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, పామర్రు తహసిల్దార్ రవికాంత్, తూర్పు డెల్టా కృష్ణా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ నల్లూరుపల్లి గణేష్, మండల పార్టీ ప్రెసిడెంట్ కుదరవల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News