మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా విద్యుత్ దీపాలు బాగా వెలగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి 65 మార్గంలో విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న సోడియం వ్యాపర్ విద్యుత్ దీపాల వలన తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా వాటి స్థానంలో ఎల్ఈడి దీపాలు గాని సౌరశక్తి దీపాలు గాని ఏర్పాటు చేయుటకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి తీసుకొని రావాలన్నారు. అలాగే ప్రధాన మార్గంలో వేగనిరోధకాల ఏర్పాటు చేసిన చోట సూచిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు అక్కడ రహదారి మార్కింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. మోర్త్ నిర్వహిస్తున్న జాతీయ రహదారిపై 41 చోట్ల విద్యుత్ దీపాలు వెలగకపోవడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ విద్యుత్ దీపాలు సరిగా వెలిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, ఆర్టీవో ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాసరావు, డి పి టి ఓ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, జాతీయ రహదారి పి డి విద్యాసాగర్, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News