గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గత ఏడాది కంటే రహదారి ప్రమాదాలు తగ్గాయని, ఇదే చొరవ కొనసాగాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం రహదారి ప్రమాదాలు తగ్గింపుపై అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గత 2024 సంవత్సరంలో 1046 ప్రమాదాలు జరిగాయని, 2025 సంవత్సరంలో 910 జరిగాయని తెలిపారు. రహదారి ప్రమాదాలు వలన ఎప్పుడూ జరిగే మరణాలు 2025 సంవత్సరంలో 19 శాతం తగ్గాయని చెప్పారు. రహదారి ప్రమాదాలు ఇంకా తగ్గించాలని, బ్లాక్ స్పాట్ లు వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఉంటే అటువంటి ప్రదేశాల్లో తీసుకోవలసిన చర్యలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఐ రాడ్ లో అన్ని ఆసుపత్రులు నమోదు కావాలని అన్నారు.
పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మద్యం తీసుకుని వాహనాలు నడిపే వారిపై నిరంతరం డ్రైవ్ చేపడుతున్నామని అన్నారు. సర్వీసు రహదారి నుండి జాతీయ రహదారిపైకి ప్రవేశించే రహదారుల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిన అవసరం ఉందని వివరించారు. నుండి జాతీయ రహదారిపైకి ప్రవేశించే ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా ప్రత్యేక బృందాలతో అవగాహన చేపడుతున్నామని చెప్పారు.
ఉప రవాణా కమిషనర్ సీతారామి రెడ్డి మాట్లాడుతూ బ్లాక్ స్పాట్ లు గుర్తించమని, జాతీయ రహదారి పనులు జరుగుతున్న ప్రదేశాల వద్ద ప్రజలు వేగ నియంత్రణ పాటించాలని అన్నారు. జాతీయ రహదారి సాధికార సంస్థ అధికారులు మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు త్వరలో పూర్తి చేయనున్నామని చెప్పారు. రహదారులు భవనాల శాఖ ఇంజనీర్లు మాట్లాడుతూ 14 బ్లాక్ స్పాట్ లు గుర్తించమని, వాటి వద్ద చర్యలు తీసుకొనుటకు ప్రతిపాదనలు సమర్పించమన్నారు.
ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,
డి ఎస్పీ బి.శ్రీనివాస రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఎన్.టి.ఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News