గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహాలు నివారణే ధ్యేయం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. గత నవంబరు 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణంలో వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించవలసిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్య వివాహాలు నివారణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. బాల్య వివాహాలు వలన అనేక అనర్థాలకు దారి తీస్తుందని చెప్పారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబ భారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరయిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు మాట్లాడుతూ బాల్య వివాహత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమములో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాద్యతలు సమర్ధవంతముగా నిర్వహించాలని అన్నారు.
జిల్లా విద్యా శాఖాధికారి డా. సలీం భాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువ సార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ అన్ని శాఖల సమన్వయ కృషితో సాధ్యమని, వివిధ సమస్యలకు గురి కాబోయే బాలలను క్షేత్ర స్థాయిలో గుర్తించి వారి హక్కుల ఉల్లంఘన కాకుండా రక్షించే క్రమములో వివిధ ప్రభుత్వ శాఖలు, వివిధ స్వచ్చంద సంస్థలు సమన్వయం అవసరమన్నారు.
ఇతర వక్తలు మాట్లదుచు బాల్య వివాహ రహిత జిల్లాగా గుంటూరు జిల్లాను రూపుదిద్దే క్రమంలో సంబంధిత శాఖ అధికారులు శుద్దితో పని చేస్తామని తెలిపారు. మహిళా పోలీసు స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు వారు మాట్లాడుచు ప్రతి పొలిసు స్టేషన్లో ప్రత్యకముగా కేటాయించబడిన బాలల సంక్షేమ పొలిసు అధికారులు బాల్య వివాహాలు లేకుండా ఇతర బాల రక్షణకు సంబందించిన వివిధ చట్టాలు మరియు విధానాలు అమలులో బాలల స్నేహ పూర్వ పద్దతితో పని చేస్తారు అని తెలిపారు. బాల్య వివాహం అనే ప్రమాదం నుండి బయట పడి ప్రభుత్వ మరియు కుటుంబాల రక్షణలో ఉన్న చిన్నారులను ఈ సందర్బముగా సత్కరించారు. బాల్ వివాహ ముక్త్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News