Breaking News

ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం


– అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల.
-ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం.
-సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 

గతంలో ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా కాకుండా, ఇరిగేషన్ అధికారులు తీరు మార్చు కోవాలని హెచ్చరించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి నిమ్మల నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, వంటి పనులకు సంబందించిన అంచనాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయా పనులకు సంబందించి మార్చి 25వ తేదీలోపు నియోజకవర్గాల వారీగా అంచనాలు రూపొందించి పంపించాలని ఆదేశించినా, ఇప్పటి వరకు కొంత మంది చీఫ్ ఇంజనీర్లు సరిగా అంచనాలు సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, మట్టి పూడిక తీత వంటి పనులు చేయడానికి ఏప్రియల్, మే, నెలలో మాత్రమే అవకాశం ఉంటుంది. ఆతరువాత ఖరీఫ్ సీజన్ మొదలైతే పనులు చేయడానికి అవకాశం ఉండదని, గతంలో ఏప్రియల్, మే నెలలో చేయాల్సిన పనులకు జూన్ లో అనుమతులు ఇచ్చేవారని, పనులు మొదలుపెట్టిన వెంటనే కాలువలకు నీళ్ళు వదిలేవారని, దీంతో పనులు సగంలోనే వదిలేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల ఆయకట్టు చివరన ఉన్న పొలాలకు సాగు నీరందక రైతులు ఇబ్బందిపడాల్సి వస్తుందని, ఇలా గతంలో వ్యవహరించిన తీరులో కాకుండా ముందుగానే అంచనాలు రూపొందించి, ఆర్దిక శాఖ అనుమతులు పొందితే సీజన్ మొదలయ్యేలోగా పనులు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కావున నియోజకవర్గాల వారీగా పనులకు సంబందించిన అంచనాలను ఆదివారం సాయంత్రం లోగా పంపాలని సిఈలను ఆదేశించారు. గడువులోగా అంచనాలను పంపని అధికారులు సోమవారం అమరావతి సచివాలయంకు వచ్చి అంచనాలు ఎందుకు పంపలేకపోయారో సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యవసర పనుల కింద నిధులు విడుదల చేసి, కాలవల్లో పూడిక తీత, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులను చేయడం ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరందించగలిగామని తెలిపారు. గత 5ఏళ్ళ వైసిపి ప్రభుత్వ పాలనలో కనీస నిర్వహణ పనులు సైతం పట్టించుకోకపోవడంతో ఆయకట్టు చివరి ఎకరం వరకు నీరందక రైతులు ఇబ్బంది పడ్డారని, నేడు కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కావున అధికారులు నిర్లక్ష్యం వదిలి గడువులోగా ఇరిగేషన్ పనులకు సంబందించిన అంచనాలు సమర్పించి, సీజన్ మొదలయ్యేలోగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *