Breaking News

మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు చేయూత‌


-స్వ‌యం ఉపాధికి స‌రికొత్త మార్కెటింగ్‌
-మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు షాపింగ్ మాల్స్ భ‌రోసా
-సామాజిక బాధ్య‌త‌గా తొలి అడుగు వేసిన ఎల్ఈపీఎల్‌
-ఎన్‌టీఆర్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, కృష్ణా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా ఎన్‌టీఆర్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, కృష్ణా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ చొర‌వ‌తో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర స్వయం ఉపాధి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందించేందుకు షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. శ‌నివారం న‌గ‌రంలోని ఎంజీ రోడ్డులోని ఎల్ఈపీఎల్ సెంట్రో షాపింగ్ మాల్‌లో అయిదుగురు మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా కేటాయించిన స్టాళ్ల‌ను క‌లెక్ట‌ర్లు ల‌క్ష్మీశ‌, డీకే బాలాజీ ప్రారంభించారు. మ‌హిళ‌ల స్వ‌యం ఉపాధి ఉత్ప‌త్తులను ప‌రిశీలించి ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని వ్యాపారాల‌ను విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స్వ‌యం స‌హాయ‌క సంఘాల
మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసుకునే అవకాశం పొందుతారని, మధ్యవర్తుల అవసరం తగ్గి వారికి అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుందన్నారు. ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి అంశాలపై కూడా వారికి అవసరమైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్న‌ట్లు తెలిపారు.
సామాజిక బాధ్యతగా ఎల్ఈపీఎల్‌ సంస్థ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు అందించడం విశేషమని తెలిపారు. ఈ తరహా భాగస్వామ్యాలు మహిళల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైజ్ కేంద్రం ద్వారా ఇప్ప‌టికే వివిధ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని.. ఇప్పుడు మార్కెటింగ్ ప‌రంగా చేయూత‌నిస్తున్న‌ట్లు వివ‌రించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్వయం ఉపాధి రంగంలో ఉన్న మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.
మ‌హిళ‌ల‌కు సుస్థిర ఆదాయం: డీకే బాలాజీ
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ లింకేజీలు కల్పించడం ద్వారా స్థిరమైన ఆదాయం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స‌హ‌కారానికి సామాజిక బాధ్య‌త‌గా తోడ‌య్యే ఇలాంటి చేయూత‌తో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త నినాదంతో ముందుకెళ్తోంద‌ని.. ఈ ల‌క్ష్యాల సాధ‌న‌లో సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వామ్యం కావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. భావిత‌రాల‌కు సృజ‌నాత్మ‌క సంప‌ద‌ను వార‌స‌త్వంగా అందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు అందిస్తున్న జీవ‌నోపాధి రుణాలు స‌ద్వినియోగం చేసుకునేలా మ‌హిళ‌ల‌కు అన్ని విధాలా స‌హాయ‌క‌స‌హ‌కారాలు అందిస్తున్న‌ట్లు డీకే బాలాజీ తెలిపారు.
కార్య‌క్ర‌మంలో ఎల్ఈపీఎల్ సీఈవో కె.కృష్ణ‌కుమార్‌, ఎన్‌టీఆర్ జిల్లా డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, కృష్ణా డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, యూసీడీ పీవో ఎం.విజ‌య‌ల‌క్ష్మి, డీఆర్‌డీఏ, మెప్మా త‌దిత‌ర శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *