-రేపు తొలివిడత హజ్ యాత్రికులు ప్రయాణం-మంత్రి ఉదయం జెండా ఊపి ప్రారంభిస్తారు
-రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం నుంచి తొలిసారి నిర్వహిస్తున్న హజ్ యాత్ర
-హజ్ యాత్ర సురక్షితంగా, సాఫీగా సాగేందుకు పటిష్ట చర్యలు
-యాత్రికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి సూచన
-మైనార్టీ వ్యవహారాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. గన్నవరం లోని ఎస్‌ఎమ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద హజ్ యాత్రికుల కోసం చేసిన తుది ఏర్పాట్లను శుక్రవారం మైనార్టీ వ్యవహారాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ అధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. యాత్రికుల సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ చేసిన ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ మాట్లాడుతూ.. తొలి విడతగా శనివారం ఉదయం 9 గంటలకు 160 మంది హజ్ యాత్రికుల ప్రయాణాన్ని ఘనంగా జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాముఖ్యం అందిస్తున్నారని, పవిత్ర హజ్ యాత్రకు రాష్ట్రం నుండి ఈ ఏడాది 2005 మంది హజ్ యాత్రికులు వివిధ ఎంబార్కేషన్ పాయింట్ల నుండి పవిత్ర మక్కా, మదీనా యాత్ర కు ప్రయాణం సాగించనున్నారన్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి రెండు విడతలుగా 335 మంది వెళ్లనున్నారన్నారు. తొలి విడతో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్లనున్నారన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా, నివాసం, వైద్య సదుపాయాలు తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
ఎస్ఎమ్ కన్వెన్షన్ పరిశీలనలో మంత్రి వెంట మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా, హజ్ కమిటీ సీఈవో గౌస్ పీర్, తదితరులు ఉన్నారు.
హజ్ యాత్రికుల కోసం సమగ్ర సదుపాయాలు – ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
హజ్ యాత్రికుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హజ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేసింది. గన్నవరం లోని ఎస్‌ఎమ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికుల కోసం కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక వసతి, భోజన ఏర్పాట్లు కల్పించారు. యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ నిబంధనలకు అనుగుణంగా లగేజ్ ప్యాకింగ్ చేసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు, గుర్తింపు కార్డుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కన్వెన్షన్ సెంటర్ మొత్తం ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలతో సిద్ధం చేశారు.
ఈ ఏడాది హజ్ యాత్రికుల్లో 50 శాతం మహిళలు ఉండటం విశేషం. వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అదనపు సదుపాయాలు కల్పించారు. విదేశీ మారకద్రవ్య అవసరాల కోసం తాత్కాలిక బ్యాంక్ ఎక్స్ టెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదనంగా, యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక వైద్య కేంద్రం, భద్రత కోసం పోలీసుల పటిష్ట బందోబస్తు, వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.
Prajavartha Online Telugu News