-37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికపై శిక్షణ
-నేడు ప్రపంచ విద్యార్థులు… రేపటి తరానికి మార్గదర్శకులు!
-ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నవశకం
-గ్లోబల్ స్టాండర్డ్స్ దిశగా అడుగులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, బోధనా నాణ్యతను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా, మన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ పొందుతూ, గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. దీనిలో భాగంగా, 2025లో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ పొందిన 37 మందికి అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానాన్ని అందించేందుకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ విజిట్ (International Exposure Visit) కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఫ్యూచర్ రెడీ’ సంకల్పం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ ప్రశంసనీయం.
ముఖ్యమంత్రి గారి ‘ఫ్యూచర్ రెడీ’ సంకల్పం
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచంలోని ఏ మూలన ఉన్న విద్యార్థితోనైనా పోటీ పడాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్ష. దానికి పునాది పాఠశాల నుంచే పడాలని, కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా బోధనా నాణ్యతను పెంచేందుకు ఆయన ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నారా లోకేష్ ప్రత్యేక చొరవ: ‘డిజైనింగ్ లెర్నింగ్ – ఇన్స్పైరింగ్ థింకింగ్’
ఈ దిశగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నారా లోకేష్ ప్రతి నిర్ణయంలోనూ ‘అంతర్జాతీయ ప్రమాణాల’ను జోడిస్తున్నారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (NIE), ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కు(University of Turku)లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి గ్లోబల్ నెట్వర్కింగ్ లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వారుగా కాకుండా, పిల్లల్లో ఆలోచనలను ప్రేరేపించే ‘లెర్నింగ్ ఫెసిలిటేటర్స్’గా మారాలని లోకేష్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సింగపూర్ బాటలో ‘లెర్నింగ్ ఫెసిలిటేటర్స్’
తొలుత సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (NIE) లో మే 4 నుండి మే 8, 2026 వరకు జరుగుతున్న ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయి. “డిజైనింగ్ లెర్నింగ్, ఇన్స్పైరింగ్ థింకింగ్” అనే నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో 37 మంది ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
పారదర్శకతకు నిదర్శనం
బృందంలో కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుండా, విద్యా వ్యవస్థలోని అన్ని స్థాయిలకు ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది. మంత్రి లోకేష్ గారి ఆదేశాల మేరకు, రాజకీయాలకు తావులేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 గురు ప్రిన్సిపాల్స్, 5 గురు ఫిజికల్ డైరెక్టర్లను విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఈ పర్యటనకు ఎంపిక చేశారు. వీరిలో 17 మంది మహిళలు ఉండటం కొసమెరుపు.
శిక్షణలో ఇవీ…
NIE లో మే 4 నుండి 8 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ‘అనిశ్చిత కాలంలో విద్య – ఎదుర్కొంటున్న సవాళ్లు’, సింగపూర్ విద్యా విధానంపై అవగాహన, బోధనా ప్రణాళిక రూపకల్పన (Instructional Design), యిషున్ సెకండరీ స్కూల్ సందర్శన, విశ్లేషణాత్మక ఆలోచన (Critical Thinking) బోధనపై చర్చ, అధ్యాపకులకు అవసరమైన సమన్వయ నైపుణ్యాల (Facilitation Skills)పై అవగాహన, ఆంధ్రప్రదేశ్‌లోని తరగతి గదులను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, అర్థవంతమైన అభ్యసన రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
కేవలం పాఠాలు కావు.. సరికొత్త పాఠాలు!
ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు మాత్రమే కాదు.. విద్యార్థిలోని ఆలోచనలను తట్టిలేపే ఒక మార్గదర్శి (Facilitator) అని నిరూపించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం.
విద్యార్థులు ప్రశ్నలు అడిగేలా, విమర్శనాత్మక దృక్పథంతో ఆలోచించేలా (క్రిటికల్ థింకింగ్) చేసే మెళకువలు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను ఆకర్షణీయంగా రూపొందించడం, సింగపూర్‌లోని ‘యిషున్ సెకండరీ స్కూల్’ వంటి పాఠశాలలను సందర్శించి, అక్కడి తరగతి గది నిర్వహణను, డిజిటల్ బోధనా పద్ధతులను మన టీచర్లు ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తున్నారు.
ఫిన్లాండ్ వైపు మరో అడుగు!
సింగపూర్ పర్యటనతో పాటు, విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే పాఠాలు నేర్పే ఫిన్లాండ్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ తుర్కు'(University of Turku) కి మరో 29 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం పంపేందుకు ప్రణాళిక వేస్తోంది. ఏపీ విద్యారంగం గ్లోబల్ మ్యాప్‌లో ఎంత వేగంగా దూసుకుపోతుందో అనడానికి ఇది ఒక నిదర్శనం.
అంతర్జాతీయ మెళకువలను క్షేత్రస్థాయికి…
కేవలం పర్యటనలతోనే సరిపెట్టకుండా, ఈ ఉపాధ్యాయులు తిరిగి వచ్చాక తమ పాఠశాలల్లో ‘పోస్ట్ ట్రైనింగ్ యాక్షన్ ప్లాన్’ అమలు చేసేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. వీరు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు మెంటర్లుగా వ్యవహరిస్తూ, తాము నేర్చుకున్న అంతర్జాతీయ మెళకువలను క్షేత్రస్థాయికి చేరుస్తారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) లక్ష్యాలకు అనుగుణంగా, మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ తపన అభినందనీయం. ఉపాధ్యాయుల నైపుణ్యమే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ శిక్షణ ద్వారా రేపటి తరానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తోంది.
ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పునకు నాంది
‘‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, విద్యాశాఖ మంత్రి పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయులను ఎంపిక చేశాం. ఈ శిక్షణ కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు; ఇది మన విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పునకు నాంది. సింగపూర్‌లోని ‘యిషున్ సెకండరీ స్కూల్’ వంటి చోట్ల వారు నేర్చుకుంటున్న ‘ఇన్స్ట్రక్షనల్ డిజైన్’, ‘క్రిటికల్ థింకింగ్’ మెళకువలు మన రాష్ట్రంలోని తరగతి గదులను ‘ఫ్యూచర్ రెడీ’గా మారుస్తాయనడంలో సందేహం లేదు. అక్కడి నుండి తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు ఇతర టీచర్లకు మెంటర్లుగా మారి, ఈ అంతర్జాతీయ జ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాం.”
Prajavartha Online Telugu News