-గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ. 369.20 కోట్ల మంజూరు
-పెమ్మసాని ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు
-33 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు స్థిరీకరణ
-33 గ్రామాలు, 4 లక్షలకు పైగా ప్రజలకు ఆసరా
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లా ప్రజల కల సాకారమయింది. 33 వేల ఎకరాల ఆయకట్టుకు, 33 గ్రామాల ప్రజలకు ఆసరాగా మారుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గుంటూరు ఛానల్ ఆధునికీకరణ ప్రతిపాదనకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 369.20 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. దీంతో నీటి సమృద్ధి పెరిగి తాగునీటి వ్యవస్థ వృద్ధి చెందుతూ వ్యవసాయానికి మరింత ఉపయోగపడబోతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా రైతాంగం ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్నారు.
గుంటూరు జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసే దిశగా గుంటూరు ఛానెల్ ఆధునికీకరణ పనులకు రూ. 369.20 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. కృష్ణా డెల్టా సిస్టమ్‌లో భాగంగా 0 నుండి 47 కి.మీ వరకు లీడింగ్ ఛానల్ మరియు డిస్ట్రిబ్యూటరీలతో కూడిన సమగ్ర అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి నం.217, తేదీ 04-05-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ… ఈ ప్రాజెక్ట్ గుంటూరు జిల్లాలో సాగునీటి సరఫరాను మరింత బలోపేతం చేసి, రైతులకు స్థిరమైన నీటి సౌకర్యాలను పెంచుతుందని తెలిపారు. కాలువ ఆధునికీకరణతో నీటి వినియోగ సామర్థ్యం పెరిగి, వ్యవసాయ ఉత్పాదకతకు పెద్ద ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ గుంటూరు ఛానల్ ఆధునికీకరణ నిమిత్తం విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో పాటు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గారు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు కూడా కృషి చేశారు.
కృష్ణా డెల్టా ప్రాంతంలో నీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే ఈ ప్రాజెక్ట్, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలకంగా మారుతుందని తెలిపారు.
“రైతుకు నీరు అందితేనే అభివృద్ధి సాధ్యం… ఈ ప్రాజెక్ట్ ఆ దిశగా కీలక అడుగు” అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గుంటూరు ప్రాంతానికి ఈ కీలక ప్రాజెక్ట్ మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్య మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆధునికీకరణ వల్ల ఉపయోగాలు
* కృష్ణా నది కుడి ఒడ్డున ప్రకాశం బ్యారేజి పైప్రాంతం నుండి ప్రారంభమయ్యే ఈ కాలువ సుమారు 47 కి.మీ. పొడవుతో తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు, చెబ్రోలు, వట్టిచెరుకూరు మరియు ప్రత్తిపాడు మండలాలకు సాగునీరు అందిస్తోంది. ఈ కాలువ ద్వారా సుమారు 27,000 ఎకరాల ఆయకట్టు లాభపడుతోంది.
* ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మంగళగిరి మున్సిపాలిటీతో పాటు 33 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడంలో ఈ కాలువ కీలక పాత్ర పోషిస్తోంది.
* కాలానుగుణంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని, గుంటూరు కాలువ వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయబడుతున్నాయి. అదేవిధంగా, సుమారు 30 కి.మీ. విస్తరణ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఈ విస్తరణ ద్వారా అదనంగా 41 గ్రామాలకు తాగునీరు అందించబడటంతో పాటు సుమారు 50,000 ఎకరాల భూమికి సాగునీరు అందించబడుతుంది.
Prajavartha Online Telugu News