-ఏజన్సీలతో ఏడీసీ, సీఆర్డీఏ ఉన్నతాధికారుల సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని కార్మిక శిబిరాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలి. గుత్తేదారులు వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్ వి.విజయరామరాజులు అధికారులను ఆదేశించారు. పొరుగు ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చి ఇక్కడ రాజధాని పనులను చేస్తున్న కార్మికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని లేబర్ క్యాంపులలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని తమ ప్రత్యక్ష తనిఖీలలో తేటతెల్లమైందని ఈ సందర్భంగారు వారు అధికారులకు, గుత్తేదారు సంస్థలకు గుర్తుచేశారు. లేబర్ క్యాంపులలో సదుపాయాలపై బుధవారం రాయపూడిలోని బ్లాక్-4 ఏడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉదయం, రాత్రి కార్మిక శిబిరాలను పర్యవేక్షించాలని ఉభయులు ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు బృందం మలివిడత పర్యటనకు వచ్చే లోగా అన్ని క్యాంపులలో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన చేయాలని సూచించారు. ప్రతి క్యాంపులో సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండితీరాలని కచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. సెంట్రల్ కిచెన్‌తో పాటు తాగునీరు, శానిటేషన్ కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రపంచ బ్యాంకు షరుతుల ప్రకారం పర్యావరణ మరియు సామాజిక నిర్వహణ ప్రణాళికలను నూరుశాతం అమలుచేసేలా చర్యలు తీసుకురావాలన్నారు. ఈ నెలాఖరు నాటికి కార్మిక శిబిరాలలో పూర్తిస్థాయి సౌకర్యాల కల్పన జరిగేలా ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఇంజినీర్-ఇన్-ఛీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి, ఛీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సీహెచ్.ధనుంజయ, ఏడీసీ ఈఎస్ఎంయూ హెడ్ డాక్టర్ కె.వి.గణేష్‌బాబు, ఈఎస్ఎంయూ, పీఎంసీ, పీజీఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News