Breaking News

పర్యాటకంతో ఆదాయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రూ.4 కోట్లతో పెనుకొండలో రెండు ఎకో పార్కుల నిర్మాణం
-త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభం
-భారీ ఎన్టీఆర్ విగ్రహం కూడా రిజర్వాయర్ లో ఏర్పాటు
-రూ.450 కోట్లతో వీరన్నకొండపై ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం
-చురుగ్గా సాగుతున్న పనులు
-పర్యాటకంతో ఆదాయ ఆర్జన : మంత్రి సవిత
-వీరన్న కొండ వద్ద ఫారెస్ట్ టోల్ గేట్ ను ప్రారంభించిన మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో పెనుకొండ ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభించనున్నామన్నారు. రాయలసీమలో సాగు, తాగునీటి కల్పనకు కృషి చేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ లో ఏర్పాటు చేయనున్నామన్నారు. రూ.450 కోట్లపై నిధులతో వీరన్నకొండపై ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటక పటంలో పెనుకొండను నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెనుకొండ పట్టణంలోని తిమ్మరుసు సమాధి వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ గేట్ ను మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.ముఖ్యంగా రాయలసీమను టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సైతం అమలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా పెనుకొండ పట్టణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. దీనిలో భాగంగా పలు ప్రాజెక్టులను చేపట్టామన్నారు. వీరన్నకొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కొండ కింద 60 ఎకరాల్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు మానసిక వికాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపడతారన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రవచనాలు, కృష్ణతత్వ బోధనలు చేస్తారని మంత్రి సవిత తెలిపారు.

రూ.4 కోట్లతో 2 ఎకో పార్కుల ఏర్పాటు

నగర వన్ యోజన ప్రాయోజిత పథకం కింద పెనుకొండ పట్టణంలో రెండు ఎకో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. వీరన్న కొండపై రూ.2 కోట్లతో శ్రీకృష్ణదేవరాయ ఫోర్ట్ ఎకో పార్క్, పట్టణంలోని బెంగుళూరు-హైదరాబాద్ హై వే పక్కన మరో రూ.2 కోట్లతో పెనుకొండ ఎకో పార్క్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ఎకో పార్క్ లో చిన్న పిల్లల ఆటస్థలం, పచ్చిక బయలుతో కూడిన ల్యాండ్ స్కిప్పింగ్, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ ఫూల్, చిట్టడవిని తలపించేలా మియావాకి ప్లాంటేషన్, రెస్టారెంట్, ట్రెక్కింగ్ పాత్ నిర్మించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ ఎకో పార్క్ లో ఆట స్థలం, రెస్టారెంట్, సందర్శకులు బస చేసేలా కాటేజీలు, సన్ రైజ్, సన్ సెట్ ప్యూపాయింట్లు, కొండపైనున్న బైరావని కుంటకు రహదారి ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్లామని మంత్రి సవిత తెలిపారు.

త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభం

పర్యాటక అభివృద్ధిలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ లో త్వరలో బోటింగ్ ప్రారంభించనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. రిజర్వాయర్ లో రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరందించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. కుంభకర్ణ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు సంబంధించిన డీపీఆర్ లు సైతం రూపొందించి, ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. రిజర్వాయర్ లో బోటింగ్ ప్రారంభించడం ద్వారా పట్టణానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం కూడా రానుందని, పలువురికి ఉపాధి సైతం లభించనుందని మంత్రి సవిత తెలిపారు.

టోల్ గేట్ తో అసాంఘిక కార్యక్రమాలకు చెక్

అంతకు ముందు తిమ్మరుసు సమాధి వద్ద టోల్ గేట్ ను మంత్ర సవిత ప్రారంభిస్తూ మాట్లాడారు. టోల్ గేట్ ను ఏర్పాటు చేయడం ద్వారా కొండపై అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం కలుగుతుందన్నారు. కొండపై సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారన్నారు. దీనివల్ల కొండపైకి వెళ్లేవారికి భద్రతతో పాటు భరోసా కూడా లభిస్తుందన్నారు. అనంతరం ఆమె వీరన్నకొండ వద్ద మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *