
-నగరంలో అతిపెద్ద ఫ్రిజమ్ అత్యాథునిక ల్యాబరేటరీ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మేకతోటి సుచరిత
-గుంటూరు నగరం ఆతిథ్యం మరువలేను- మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని
-ఇంటి వద్దకే సేవలు… సేవాభావంతో కొన్ని సేవలు ఉచితం
-ల్యాబ్ డైరెక్టర్లు డాక్టర్ అనీల్‌రెడ్డి, డాక్టర్ మనీష్ వెల్లడి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అతిపెద్ద ఫ్రిజమ్ అత్యాధునిక ల్యాబరేటరీని ఏర్పాటు చేసి, నగర వాసులకు అందుబాటులోకి తీసుకురావడం ముదావహమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద ఫ్రిజమ్ లేబొరేటరీస్ సెంటర్‌ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విలేకరుల సమావేశంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ… ఇటువంటి ఆధునాతన డయాగ్నోసిస్ సెంటర్ ఏర్పాటు వల్ల కోవిడ్ పరీక్షల్లో ఫలితాలు వెంటనే తెలిసే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కరోనా సోకిన రోగి ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నేడు ఆ అవసరం లేదని పేర్కొన్నారు. గుంటూరు నగరం మెడికల్ హబ్‌గా మారిందని, అత్యాధునికమైన ఇటువంటి ల్యాబ్స్ వల్ల వ్యాధిని త్వరితగతిన గుర్తించి తగిన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్షా మంగ్లాని జ్యోతి ప్రజ్వలన అనంతరం మాట్లాడుతూ… గుంటూరు నగరానికి తాను రావడం తొలిసారని తెలిపారు. ఇక్కడి నగరవాసుల ఆతిథ్యాన్ని మరువలేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ సెర్చ్ చేస్తే గుంటూరు మెడికల్ హబ్ అని ఇటువంటి నగరంలో అతిథిగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ల్యాబ్ డైరెక్టర్లు డాక్టర్ అనీల్‌రెడ్డి, మనీష్‌లు అందరికీ అందుబాటులో ఉంటూ అత్యాధునిక డయాగ్నోసిస్ సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు.
ల్యాబ్ డైరెక్టర్లు డాక్టర్ అనీల్‌రెడ్డి, డాక్టర్ మనీష్‌లు మాట్లాడుతూ… ఫ్రిజమ్ లేబొరేటరీస్‌లో థైరాయిడ్, షుగర్, సంతానలేమికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు, క్యాన్సర్ మార్కర్లు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటి దగ్గరనే, రక్త నమూనా సేకరణతో పాటు ఉచితంగా బీపీ చెకప్ చేయించుకునే సదుపాయం ఉందన్నారు. అలాగే.. డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉచిత డైటీషియన్ సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. అధునాతన కంప్యూటరైజ్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లతో ఖచ్చితమైన పరీక్షలు నిర్వహించడం తమ ప్రత్యేకతని తెలిపారు. నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా కేవలం 15 నిమిషాలలో ఇంటి వద్దకే వచ్చి రక్త నమూనా సేకరణ రక్త పరీక్షల రిపోర్టును ఎప్పటికప్పుడు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేయడంతో పాటు ఇంటి వద్దనే రిపోర్టు మొబైల్, కంప్యూటర్‌లో చూసుకొని ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. డెంగ్యూ నిర్థారణ పరీక్షలు కూడా చేస్తామని పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ల్యాబ్ ప్రధాన కేంద్రం కాగా.. నగరంలోని పట్నంబజార్, గుజ్జనగుండ్ల, ఏ.టి.అగ్రహారం, పొన్నూరు రోడ్డు, పాత గుంటూరు, అమరావతి రోడ్డులో తమకు బ్రాంచీలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డాక్టర్ నాగశ్రీ హరిత పర్వతనేని, పలువురు నగర ప్రముఖులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొని ల్యాబ్ డైరెక్టర్లను అభినందించారు.
Prajavartha Online Telugu News