అద్దాల మేడలు కాదు ఆసుపత్రులు కట్టండి… : పేర్ని నాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాడు వైద్యునిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని, అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానాన్ని ఉపసంహరించుకుని నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను తక్షణమే పూర్తి చేయాలని లేని పక్షంలో 2029 ఎన్నికల కౌంటింగ్ జరిగే సాయంత్రం వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటి పోరాటం చేస్తుందని వైసిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈనెల 9వ తేదీన విజయవాడలోని ఎంబి భవన్ నందు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కళాశాలలను ప్రభుత్వం వెంటనే నిర్మించాలి అనే అంశంపై జరిగిన చర్చా గోష్టి కార్యక్రమానికి డా|| ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పేర్ని నాని ప్రసంగిస్తూ మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని, నేడు కూటమి ప్రభుత్వం వైద్య విద్య ప్రభుత్వానికి సంబంధం లేని పరిస్థితికి తీసుకొచ్చిందని, మన కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి తెలంగాణలో ఫ్రీ సీటు దొరుకుతుందని, వెనుక బడిన కులాలకు వైద్య విద్యను దూరం చేసే ప్రక్రియను విడనడాలని హితవు పలికారు. ప్రజల ఆస్తులను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్తి పలకాలని, పాపం చేయబోతున్నామనే అపరాధ భావంతోనే మెడికల్ కాలేజీల టెండర్ల లో ఎవరు పాల్గొనడం లేదని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణకై ప్రజా సంఘాలు జరిపే పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రసంగిస్తూ రాష్ట్రంలో వైద్య కళాశాలలు శిథిలమౌతున్నాయని, నిరంతరం అభివృద్ధి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు. అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులకు, ఆత్మహత్యలకు, శిశు మరణాలకు కారణం అయ్యేలా ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేయడం తగదన్నారు. ప్రైవేట్ రంగం సామాజిక న్యాయాన్ని దూరం చేస్తుందని, భూములు తీసుకుని దివాలా తీసి బ్యాంకులను ముంచేసిన ప్రైవేట్ కంపెనీలు అనేకం ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటి రాష్ట్ర కన్వీనర్ డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన మెడికల్ సీట్లను తిరస్కరించిన ప్రభుత్వం మనదేనని, ఈ అనాలోచిత చర్య వలన గత రెండేళ్లలో నిర్వహించిన కౌన్సిలింగ్ లో మన విద్యార్థులు గణనీయంగా సీట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర నీట్ వ్రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుందని, ప్రైవేట్ వైద్య కళాశాలలు మూతపడే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాల్సింది సింగపూర్ లోని ఎత్తైన భవనాలను కాదని, అక్కడ ప్రజల జీవన ప్రమాణాల గురించి అని హితవు పలికారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఒక్క ఇటుక, ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసి వాటిని ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దారాధత్తం చేసే ప్రయత్నం చేస్తుందని, అతి పేదలకు ఉపయోగపడే విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేని ప్రభుత్వాలు నిలబడవని తెలిపారు. సూపర్ మార్కెట్ లకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం దేశంలో మరెక్కడ లేదని, వీటికి అడ్డుకట్ట వెయ్యకపోతే రాష్ట్రం ముందుకెళ్లదని, ప్రభుత్వ తప్పుడు చర్యలను నిలువరించేందుకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమవ్వాలని కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ప్రభుత్వ రంగంలో నిర్మిస్తేనే పేద విద్యార్థులకు, రోగులకు మేలు జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఏఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఎవరెవరికి ఇవ్వాలో అని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉందని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనెంపూడి శంకర్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలే వస్తున్నాయని, విద్యను అందని ద్రాక్షలా మార్చిన దుస్థితి మనకు కలిగిందన్నారు. విజన్ 2047 పేరిట చంద్రబాబు నాయుడు చేపడుతున్న తిరోగమన విధానాలను ఎండ గట్టాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక వేత్త డా|| కుర్ర వసుంధర ప్రసంగిస్తూ 590 జీఒ ని సవాలు చేస్తూ తాము హైకోర్టులో పిల్ వేశామని, కోటి సంతకాల సేకరణతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అఫిడేవిట్ ను కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. అన్ని రాయితీలు ప్రైవేట్ సంస్థలకు అప్ప చెప్పే బదులు ప్రభుత్వమే వైద్య కళాశాలలను నడపవచ్చు కదా అని ప్రశ్నించారు. న్యాయవాది కన్నా రజిని ప్రసంగిస్తూ వైద్యం విలువ రోగికి మాత్రమే తెలుస్తుందని, కాసులకు కక్కుర్తి పడకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, పేదలకు వైద్యాన్ని దూరం చేయకుండా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *