-మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య
-పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం
-అభ్యర్ధులకు “ఆల్ ది బెస్ట్” చెప్పిన మంత్రి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ద్వారా “తాలీమ్-ఏ-హునర్” పథకం కింద ప్రతిభావంతులైన పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పోరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్య అడ్మిషన్ల కోసం ఈనెల 17 వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పగడ్బందీగా పరీక్షను నిర్వహించాలని శనివారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి ఆదేశించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (బిపిఎల్ ) ముస్లిం కుటుంబాలలోని పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు రాష్ట్రం లోని అగ్రశ్రేణి కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందేనని ఫరూక్ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన అర్హులను ఎంపిక చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలు లేకుండా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, పరీక్షను నిష్పక్షపాతంగా, విజయవంతంగా జరిగేలా చూడాలని అధికార యంత్రంగాన్ని మంత్రి ఆదేశించారు.ప్రవేశ పరీక్ష నిర్వహణ విషయంలో సిబ్బందిలో ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవలసి వస్తుందని మంత్రి ఫరూక్ హెచ్చరించారు. పేద ముస్లిం కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా కార్పోరేట్ స్థాయి ఇంటర్ రెసిడెన్షియల్ విద్యను అందించడం ద్వారా నీట్, ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చేయవచ్చునని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. తద్వారా పేద,మధ్య తరగతి ముస్లిం కుటుంబాలలోని విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నత విద్యారంగంలోని వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా, వివిధ విభాగాల్లో పలు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ మంత్రి ఫరూక్ కోరారు. *రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రవేశ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను అత్యంత సమర్థవంతంగా చేసి పర్యవేక్షించాలని మంత్రి ఫరూక్ కోరారు. పరీక్ష రాసే అభ్యర్థులకు “అల్ ది బెస్ట్” చెప్పారు.”తాలీమ్-ఏ-హునర్” పథకాన్ని రూపొందించి అమలుచేయుటకు ముందుకు వచ్చిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను మంత్రి ఫరూక్ అభినందించారు.ఈ మంచి పథకానికి పూర్తి సహకారాన్ని అందించాలని వక్ఫ్ సంస్థల ముతవల్లీలు, మేనేజ్ మెంట్ కమిటీలను మంత్రి ఫరూక్ కోరారు.
Prajavartha Online Telugu News