– ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు
– రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబునాయుడు
– మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రొయ్యల ఫీడ్ ధరల పెంపు అంశంపై ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రాసెసర్లు, సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఏపీ సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫీడ్ ధరల పెంపు ప్రభావం, ఆక్వా రంగ భవిష్యత్తు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో ఫిషరీస్ కమిషనర్ రాష్ట్రంలో ప్రస్తుత ఆక్వా పరిస్థితులు, రొయ్యల ఉత్పత్తి, ఫీడ్ వినియోగం, ప్రస్తుతం ఉన్న ఫీడ్ ధరలు మరియు ఫీడ్ తయారీ సంస్థలు కోరుతున్న ధరల పెంపుపై వివరించారు. మరోవైపు రైతులు ప్రస్తుత ధరలను కొనసాగించాలని కోరిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. CIBA శాస్త్రవేత్తలు జనవరి 2026 నుంచి మే 2026 వరకు సోయా, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ వంటి ప్రధాన ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగినట్లు వివరించారు. ఈ పెరుగుదల కారణంగా ఫీడ్ తయారీ వ్యయం సగటున కిలోకు రూ.31.03 వరకు పెరిగిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ ముడి పదార్థాల వినియోగంపై కూడా సూచనలు చేశారు. ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి నుంచి ఏప్రిల్ 2026 మధ్య ప్రధాన ముడి పదార్థాల ధరలు 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. ఫిష్ మీల్ ధర మెట్రిక్ టన్నుకు రూ.1.55 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు, ఫిష్ ఆయిల్ రూ.2.80 లక్షల నుంచి రూ.4.40 లక్షలకు, సోయా లెసితిన్ రూ.68 వేల నుంచి రూ.1.10 లక్షలకు, DLM రూ.2.71 లక్షల నుంచి రూ.6.50 లక్షలకు పెరిగినట్లు వివరించారు. ఈ ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్ల ఒక్కో మెట్రిక్ టన్ను ఫీడ్ తయారీలో సుమారు రూ.25,115 అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రొయ్యల ఫీడ్ ధరలను కిలోకు రూ.25 నుంచి రూ.31 వరకు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. లేకపోతే ఫీడ్ తయారీ యూనిట్లు కొనసాగించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే రైతు ప్రతినిధులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముడి పదార్థాల ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఫీడ్ ధరలు పెంచుతున్న కంపెనీలు, ధరలు తగ్గినప్పుడు మాత్రం రైతులకు లాభం చేకూర్చడం లేదని విమర్శించారు. ఫీడ్ తయారీ సంస్థలు, ప్రాసెసర్లు, ఎగుమతిదారులు ఒకే వ్యాపార వర్గంగా వ్యవహరిస్తూ రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. రైతులు వేసవి పంట పూర్తయ్యే వరకు కనీసం రెండు నెలలపాటు ప్రస్తుత ఫీడ్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే APSADA లైసెన్స్ కలిగిన అన్ని ఆక్వా ఫార్ములకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీ విద్యుత్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా సుమారు 12,500 ఆక్వా కనెక్షన్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిష్ మీల్ ఎగుమతులపై కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు, సోయా దిగుమతులపై నిషేధం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మరోసారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే కోళ్ల ఫీడ్ ధరల విధానాన్ని అనుసరించి ప్రతి నెలా ముడి పదార్థాల ధరల ఆధారంగా రొయ్యల ఫీడ్ ధరలను నిర్ణయించే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. రొయ్యల కొనుగోలు ధరలను కూడా 15 రోజుల గడువుతో నిర్ణయించే విధానాన్ని అమలు చేయాలని సమావేశంలో అభిప్రాయపడారు. రైతులు అపోహలు, తప్పుడు ప్రచారాలకు గురికాకుండా సరైన సమయంలో పంట కోత చేపట్టేందుకు ఈ నిర్ణయాలు దోహదపడతాయని అధికారులకు తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రికి నివేదించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్, APSADA కో-వీసీ అనం వెంకటరమణారెడ్డి, ఓఎస్డీ పొలినాయుడు, CIBA చెన్నై, CIFA విజయవాడ శాస్త్రవేత్తలు, SIFT కాకినాడ ప్రిన్సిపాల్, ఫిషరీస్ యూనివర్సిటీ డీన్, MPEDA ప్రతినిధులు, ఆక్వా రైతు సంఘాలు, ఆక్వా అడ్వైజరీ కమిటీ సభ్యులు, APSADA డైరెక్టర్లు, రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News