Breaking News

పర్యాటకంతో రాష్ట్ర ప్రగతి… పురోగతి

-పర్యాటకాభివృద్ధితో 1.22 లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు
-టూరిజానికి పారిశ్రామిక హోదాతో ఏపీకి తరలి వస్తున్న ప్రాజెక్టులు
-రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా పర్యాటకాభివృద్ధికి రోడ్ మ్యాప్
-హోటళ్లు, హోం స్టేలు, థీమ్ పార్కులు, కారవాన్ టూరిజంలతో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
-బీచ్ ఫెస్టివల్స్, కార్నివాల్స్ తో కళకళలాడుతోన్న రాష్ట్రం
-జగ్గన్నతోట ప్రభల ఉత్సవంతో వెల్లివిరిసిన సాంస్కృతిక శోభ
-అన్ని ఇజంల కంటే టూరిజం బెస్ట్ అనే థియరితో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశం
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలతో పర్యాటకాభివృద్ధికి మెరుగైన చర్యలు
-ఏపీ పర్యాటకానికి నీతి ఆయోగ్ కితాబు
-రెండేళ్ల కూటమి పాలనలో టూరిజంలో విప్లవాత్మక సంస్కరణలు… పర్యాటకాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు… పర్యాటక రంగంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరిగేలా రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో పని చేసింది. టూరిజం అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా… యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా పక్కా ప్రణాళికతో టూరిజం శాఖ వ్యవహరిస్తోంది. అన్ని ఇజంలు పక్కకు పోతాయని… టూరిజమే మిగులుతుందనే మాటను వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఇదే థియరితో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ టూరిజం అభివృద్ధికి విలువైన సలహాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు… ఆధ్యాత్మిక కేంద్రాలు… దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేట్ చేయడం.. ప్రాచుర్యం కల్పించడం.. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందర్నీ ఆకట్టుకునేలా టూరిజం పాలసీ 2024–29ని ప్రభుత్వం రూపొందించారు. రాబోయే ఐదేళ్ల కాలానికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో సరికొత్త పర్యాటక విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. దీంతోపాటు… పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి.. ఇన్వెస్టర్లకు క్యాపిటల్ సబ్సిడీలు, SGST రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలను అందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దేశంలో తొలిసారిగా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2025ను ప్రవేశపెట్టి పారదర్శక పద్ధతిలో భూ కేటాయింపులు చేస్తూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. అదే విధంగా క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టే, బి&బి (B&B) విధానాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.

లక్ష్యాలను నిర్దేశించుకుని…

రాష్ట్రంలో 50,000 క్లాసిఫైడ్ గదుల ఏర్పాటు, పెద్ద ఎత్తున పెట్టుబడులు, 10,000 హోమ్ స్టేలు, 20 శాతం జీవీఏ సాధన, 12 శాతం నుంచి 15 శాతం ఉద్యోగాల కల్పన తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పర్యాటక శాఖ ముందుకు సాగుతోంది. రాష్ట్రాల్లో ఏపీని అగ్రపథాన నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతుంది. పర్యాటకాభివృద్ధి ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఏపీకి క్యూ కట్టిన అంతర్జాతీయ బ్రాండ్లు

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. రెండేళ్ల కాలంలో రూ. 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయి. అలాగే 117 ఎంఓయూలు కుదుర్చుకోగా, వీటి ద్వారా 1,22,637 మందికి ఉపాధి లభించనుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న వివిధ హోటళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజ్, మారియట్, ఐటీసీ, హయత్, ఒబెరాయ్, మేఫెర్, హిల్టన్ వంటి 14 అంతర్జాతీయ బ్రాండ్లు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కొత్తగా 7,770 హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. MICE (సమావేశాలు, ప్రదర్శనలు) కేంద్రంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

మల్టీ-ఎక్స్పీరియన్స్ టూరిజం గ్రిడ్… పర్యాటక సర్క్యూట్లు

రాష్ట్రాన్ని ఒక సమగ్ర పర్యాటక గ్రిడ్‌గా మారుస్తూ విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలలో 7 యాంకర్ హబ్‌లు, 25కు పైగా ప్రత్యేక సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నారు. కార్డెలియా సంస్థ ద్వారా విలాసవంతమైన క్రూయిజ్ ప్రయాణాలు, టైడా వద్ద లగ్జరీ టెంట్ సిటీలు, ఈజ్ మై ట్రిప్ సహకారంతో హెలీ టూరిజం, లక్స్ క్యారవాన్స్ ద్వారా క్యారవాన్ పర్యాటకం, అరకు లోయలు, లంబసింగి, గండికోట వంటి గ్రీన్ రిసార్టులు, కారవాన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఇక నదులపై తేలియాడే హౌస్ బోట్లను రాష్ట్ర పర్యాటకంలో ప్రవేశపెట్టారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాలలో దాదాపు 30 రకాల వినూత్న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరో 21 ప్రాంతాలలో 100కు పైగా కొత్త పర్యాటక అంశాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సూర్యలంకలో హౌస్ బోట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇటీవలే వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే 3 నెలల్లో భవానీ ఐలాండ్, సరస్వతీ ఘాట్, పుష్కర్ ఘాట్, గండికోటలో కూడా ఇవి పర్యాటకులను అలరించనున్నాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, బౌద్ధ సర్క్యూట్లు అందమైన బీచ్‌లు, స్వచ్ఛమైన నదీ తీరాలు, క్రూయిజ్ పర్యాటకం, ఎకో-టూరిజం, సాహసోపేతమైన సీప్లేన్ సర్క్యూట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. వీటన్నింటి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఒక ‘మల్టీ-ఎక్స్పీరియన్స్ టూరిజం గ్రిడ్’గా మార్చింది కూటమి ప్రభుత్వం. అంతేగాక పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిద్దమవుతోంది.

వెల్లివిరుస్తోన్న సాంస్కృతిక వైభవం

తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, అంతర్వేది, సింహాచలం, రాయలసీమ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ భక్తులకు మెరుగైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించారు. AirBnB, MakeMyTrip, Booking.com, Stay Vista, Homestay Buddy, HomeyHuts వంటి సంస్థల భాగస్వామ్యంతో 1,855 హోమ్‌స్టేలను అనుసంధానించారు. ప్రత్యేకంగా ‘ఏపీ హోమ్‌స్టే పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ ఉత్సవ్, గండికోట, అనకాపల్లి, విశాఖ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్టివల్ వంటి వాటితో ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తోంది. ఫెస్టివళ్ల నిర్వహణ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. బెజవాడ ఉత్సవ్ నిర్వహణతో ఏపీలోని వివిధ కళారూపాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించింది. పురాతన కాలం నుంచి కోనసీమ ప్రాంతంలో జరిగే జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తింపు ఇవ్వడంతో మంచి ప్రచారం లభించింది… లక్షలాది మంది పర్యాటకులు జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి తరలి వచ్చారు. యోగాంధ్ర, ప్రపంచ పర్యాటక దినోత్సవం, శ్రీ సాయిబాబా 100వ జయంతి వేడుకలు, కృష్ణవేణి సంగీత నీరాజనం, ఏపీ ట్రావెల్ మార్ట్ తదితర 10 ప్రధాన ఉత్సవాల ద్వారా ఏడాదంతా పర్యాటక శోభ ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వాటిలో పాల్గొన్నారన్నది అంచనా. టూరిజం అభివృద్ధిలో భాగంగా 8 జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు సుమారు 11 లక్షల మంది హాజరయ్యారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు…

ఏపీలోని పర్యాటక క్షేత్రాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. పర్యాటకానికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రచురించిన పుస్తకంలో ఏపీ పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ ద్వారా చేసిన ప్రచారాలతో 90 లక్షల మంది నెటిజన్లను రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు ఏపీ అందాలను చాటిచెప్పే 110 షార్ట్ వీడియోలు మరియు రీల్స్‌ను రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా రాపిడో భాగస్వామ్యంతో పర్యాటకులకు సరైన సమాచారం అందించేందుకు ఆటో/టాక్సీ డ్రైవర్లకు ప్రత్యేకంగా ‘డ్రైవర్-కమ్-గైడ్’ శిక్షణను ఇచ్చారు. కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ వంటి స్థానిక కళలను, లేపాక్షి వైభవాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ పై ప్రదర్శించి వారసత్వాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రాష్ట్ర పర్యాటక శాఖ 30 జాతీయ మరియు 3 అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అందాలను ప్రపంచానికి చాటిచెప్పింది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పర్యాటక సొబగులను వినూత్నంగా ప్రదర్శించడం ద్వారా పర్యాటకుల సంఖ్యను భారీగా పెరిగింది.

ప్రపంచ వేదికలపై ఏపీ పర్యాటక వాణి

మంత్రి దుర్గేష్ వివిధ దేశాల్లో పర్యటించి ఏపీ పర్యాటకం గురించి వివరించారు… ఏపీలోని టూరిజం అభివృద్ధికి ఉన్న అంశాలను ప్రజెంట్ చేశారు. జర్మనీలో జరిగిన ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొని, వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఏపీలోని మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక కోటలు, బౌద్ధారామాల విశిష్టతను ప్రపంచానికి వివరించారు. వియత్నాం టూరిజం కాంక్లేవ్, సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ ఎగ్జిబిషన్,న్యూఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, రాజస్థాన్, చెన్నై తదితర పలు వేదికలపై ఏపీ పర్యాటక విధివిధానాలను మంత్రి చాటి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం – మౌలిక వసతుల కల్పన

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల నిధులు ఇచ్చారు. స్వదేశీ దర్శన్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ. 97.52 కోట్లు, బొర్రా గుహలకు రూ. 29.87 కోట్లు, సాస్కి క్రింద అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ. 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి రూ. 25.32 కోట్లు, సింహాచలంకు రూ. 54.04 కోట్లు, అదే విధంగా సీబీడీడీ క్రింద అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ. 24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ. 25 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ జూలై 2026 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.

పెరిగిన పర్యాటకుల సంఖ్య

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి తీసుకున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్యలో 10.10% వృద్ధి నమోదు కాగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 126.87% మేర పెరగింది. పెట్టుబడుల వెల్లువ మరియు పర్యాటక ప్రాంతాల విస్తరణ వల్ల స్థానిక యువతకు హోటల్ మేనేజ్మెంట్, గైడ్స్, ట్రావెల్స్, మరియు హ్యాండీక్రాఫ్ట్స్ రంగాలలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి.

ఏపీ టూరిజానికి అవార్డులు…

ఏపీ టూరిజానికి, ఇక్కడ తీసుకుంటున్న అభివృద్ధి చర్యలకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాదిలో అతి పెద్ద ట్రావెల్, ట్రేడ్ ఎక్స్ పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ -2026 సంస్థ పర్యాటకం, సంస్కృతి, వారసత్వ సంపద, టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏపీని ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసింది. ఇక జూన్ 4న కేరళలోని తిరువనంతపురంలో మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకోబోతున్నారు.

సరికొత్త ఆలోచనలతో రండి… పెట్టుబడులు పెట్టండి: మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ప్రసాదించిన నందనవనమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంతో… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొత్సాహంతో 2 ఏళ్లల్లో పర్యాటక శాఖను అభివృద్ధి బాట పట్టించామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలమైన సమయమిదే అని చెప్పారు. సరికొత్త ఆలోచనలతో రండి, పెట్టుబడులు పెట్టండి అని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పారు. అన్ని విధాలా అండగా నిలిచి, పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి హామీ ఇస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *