Breaking News

భోగాపురం ఎయిర్‌పోర్టు అప్రోచ్‌రోడ్డుకై సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలి

-అమానుషంగా ప్రవర్తించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు సంబంధించి న్యాయమైన పరిహారం తక్షణమే అందించాలని, నిరసన తెలుపుతున్న స్థానికులపై అమానుషంగా ప్రవర్తించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు తమకు రావలసిన న్యాయమైన పరిహారం చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, బైరెడ్డిపాలెం గ్రామ రైతులు, వృద్ధ దంపతులు అధికారుల కాళ్ళావేళ్ళా పడి వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పరిధిలో ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం ప్రభుత్వం భూములను సేకరిస్తోంది. ఈ అప్రోచ్‌రోడ్డు కోసం తీసుకున్న తమ భూములకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, బైరెడ్డిపాలెం గ్రామ రైతులు, గ్రామస్తులపై అధికారులు, సిబ్బంది దౌర్జన్యానికి దిగడం అమానుషం. విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన అప్రోచ్ రోడ్డు పనులను ప్రారంభించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పోలీసులు శనివారం నాడు ఆ ప్రాంతానికి భారీగా చేరుకుని స్థానిక రైతులు, గ్రామస్తులపై దౌర్జన్యంగా ప్రవర్తించడం విచారకరం. తమకు రావాల్సిన నష్టపరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలంటూ స్థానిక రైతులు, గ్రామస్తులు పనులను అడ్డుకున్న క్రమంలో నిరసన తెలుపుతున్న బైరెడ్డి అప్పల నరసయ్య అనే వృద్ధుడిని, అతని కోడలు సత్తయ్యమ్మను అధికారుల ఒత్తిడితో జెసిబి ఆపరేటర్ బకెట్‌తో వాళ్లను పైకి లేపి వారిని దౌర్జన్యంగా బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గం. అధికారుల దౌర్జన్యాన్ని గమనించిన స్థానిక రైతులు, గ్రామస్తులు ఒక్కసారిగా జెసిబి వైపు దూసుకువచ్చి తీవ్రస్థాయిలో నిరసన తెలుపగా వెనక్కితగ్గిన అధికారులు బకెట్‌లో ఉన్న వృద్ధుడిని, మహిళను సురక్షితంగా కిందకు దించి పక్కకు చేర్చారు. బకెట్‌లో ఉన్న ఇరువురు ప్రాణభయంతో అక్కడి నుంచి కిందకు దూకి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉండేదన్న విషయాన్ని అధికారులు, పోలీసు యంత్రాంగం గ్రహించకపోవడం గర్హనీయం.
భోగాపురం ఎయిర్‌పోర్టు అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం అందజేయకపోగా, స్థానిక రైతులు, గ్రామస్తులపై అధికారుల దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి పేరుతో ప్రజల పొట్ట కొట్టడమే కాకుండా ప్రాణాలతో చెలగాటం ఆడడాన్ని తీవ్రంగా తప్ప్పుబడుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలి. స్థానిక రైతులు, ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తించిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *