గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని అన్ని క్లస్టర్ కంపోస్ట్ లలో కంపోస్ట్ ను నూరు శాతం తయారు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. సోమవారం 17 వ డివిజన్ లోని ఐపిడి కాలని, ఉడా రోడ్డు, బొంతపాడు డొంక తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై ప్రజారోగ్యాధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో తొలుతగా ఐపిడి కాలనీలోని రిజర్వాయర్ వద్ద గల క్లస్టర్ కంపోస్ట్ ప్రాంతాన్ని పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన క్లస్టర్ కంపోస్ట్ నూరు శాతం వినియోగంలో ఉండాలని, ప్రతి క్లస్టర్ కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని, అందుకు తగిన విధంగా స్తానిక ప్రజలకు కంపోస్ట్ తయారీ పై అవగాహన కలిగించాలని ఆదేశించారు. అలాగే ప్రతిరోజూ నూరు శాతం ఇంటింటికీ చెత్త సేకరణ తడి పొడి వ్యర్ధాలుగా జరగాలని, పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రకారం పారిశుధ్య పనులు నిర్వహించాలని, అవసరమైన ప్రాంతాలలో ప్రత్యేక గ్యాంగ్ వర్క్ లను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. సదరు ప్రాంతంలో భవన నిర్మాణ సామగ్రి ఉండుట గమనించి వెంటనే సదరు సామగ్రిని తొలగించాలని, అలాగే రోడ్ల పక్కన పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించి మరల వేయకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఐపిడి కాలనిలోని యుపిహెచ్ వద్ద నిర్మించాలని స్థానిక ప్రజలు కోరగా, సదరు ప్రాంతంలో డ్రైన్ నిర్మించుటకు అంచలాలను సిద్దం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఉడా రోడ్డులో పర్యటించి సదరు ప్రాంతంలో ఉన్న కచ్చా డ్రైన్ లో మురుగునీరు పారుదల లేక మురుగు నీరు రోడ్ల పైకి వచ్చుట గమనించి, వెంటనే కచ్చా డ్రైన్ లోని సిల్ట్ ను తొలగించాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. అనంతరం బొంతపాడు డొంక వద్ద గల పీకలవాగులో జరుగుతున్న సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించి, తొలగించిన సిల్ట్ ను స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే సదరు ప్రాంతంలో నుండి తరలించాలన్నారు. అలాగే నగరంలోని ప్రధాన డ్రైన్లలో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పడుతున్న డ్రైన్లను గుర్తించి, సదరు డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పడకుండా పర్యవేక్షణ చేయాలని, అంతేకాక ప్లాస్టిక్ వ్యర్ధాలు పడుతున్న ప్రధాన డ్రైన్లలో ఐరన్ మేష్ లను ఏర్పాటు చేసి, అక్కడకు చేరుకున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఎస్ లు, ప్రజారోగ్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News