గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను(యు.జి.డి) పక్కాగా ఏర్పాటు చేయుటకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్) తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. గుంటూరు పట్టణంలో యు.జి.డి, నిరంతర నీటి సరఫరా, సుందరమైన కూడళ్లు, పార్క్ ఏర్పాటు, పి.వి.ఎన్ నాయుడు మార్కెట్ పునర్నిర్మాణ పనులుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిఎంసి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణానికి యు.జి.డి వ్యవస్థ పక్కాగా ఉండాలన్నారు. ఇందుకు ఇప్పటికే పూర్తి అయిన భాగంతో పాటు ఇంకా పూర్తి చేయాల్సిన భాగంపై స్పష్టమైన విశ్లేషణ చేసి డి.పి.ఆర్ లు తయారు చేయాలని సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో జోన్లవారీగా ఎస్.టి.పి (సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) లను ఏర్పాటును కూడా ఇందులో చేర్చాలని అన్నారు. పి.వి.ఎన్ నాయుడు మార్కెట్ పునర్నిర్మాణ పనుల లాభదాయకతపై స్పష్టమైన విశ్లేషణ చేయాలని ఆదేశించారు.
నిరంతర నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించాలి
గుంటూరు పట్టణంలో ఉన్న అన్ని గృహాలకు నిరంతర నీటి సరఫరా అవకాశాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. నీటి సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ఎక్కడా అతిసార వ్యాధి వంటి అంశాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
8 జంక్షన్ లు ఆధునీకరణ
పట్టణంలో 8 జంక్షన్ లు ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన మోడల్ లను పరిశీలించారు. హిందూ కాలేజీ కూడలి, బి.ఆర్ నాయుడు మార్కెట్ కూడలి, జిన్నా టవర్ జంక్షన్, కలెక్టర్ కార్యాలయం కూడలి, మూడు బొమ్మల జంక్షన్, చుట్టుగుంట జంక్షన్, మెడికల్ క్లబ్ జంక్షన్ ల సుందరీకరణకు అవసరమగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఏ.పి.యు.ఐ.ఏ.ఎం.ఎల్ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News