Breaking News

అభద్రతా భావాన్ని ఆడపిల్లకు కల్పిస్తే , మౌనంగా ఉండరాదు – మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ అభద్రతా భావాన్ని ఎవరైనా కల్పిస్తే, వారి దుశ్చర్యలను భరిస్తూ మౌనంగా ఉండరాదని గళం విప్పి పెద్దలకు తెలియచెప్పాలని ప్రతి ఆడపిల్ల ఈ విషయాన్ని తప్పక నేర్చుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు.
సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.
తొలుత మచిలీపట్నం మండలం పల్లె తుమ్మల పాలెం గ్రామంకు చెందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు మంత్రి వద్ద తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలిపారు. తమ గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో చదువుపూర్తి చేసి మచిలీపట్నంలోని జైహింద్ , జార్జ్ కారనేషన్ హైస్కూళ్లలో చదువుకొంటున్నామని, ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటున్న నేపథ్యంలో తాము చదువుకొంటున్న జైహింద్ హైస్కూల్ త్వరలో మూసి వేయనున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయని తమకు ఆ పాఠశాల మినహా చదువుకునేందుకు మరో అవకాశం లేదని మంత్రికి చెప్పారు. మీకు దగ్గరలో పోలాటితిప్ప, కోన గ్రామాలలో హైస్కూళ్ళు ఉన్నాయి కదా అక్కడ చదువుకోవచ్చు కదమ్మా అని మంత్రి బాలికలతో అన్నారు. తమ పెద్దలు ఆ పాఠశాళ్లకు తమను పంపరని, అక్కడకు పంపితే ఆడపిల్లల కారణంగా లేనిపోని తగాదాలు గ్రామాల మధ్య వచ్చే అవకాశం ఉందని అందుకే మచిలీపట్నం మాత్రమే పంపిస్తారని వారు జవాబు ఇచ్చారు. పల్లెతుమ్మలపాలెం గ్రామ పెద్దలు చెన్నయ్య, రమేష్, నాగరాజులు తమ గ్రామంలో ఒక హైస్కూల్ నిర్మించేందుకు మీరు చొరవ చూపాలని అభ్యర్ధించారు. అలాగే చిన్నాపురంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మెన్ జి. సుజి మంత్రికి ఒక అర్జీ ఇచ్చారు. ఈ విషయమై మచిలీపట్నం మండల విద్యాశాఖాధికారి ప్రసాద్ ను మంత్రి తన కార్యాలయానికి పిలిపించారు. 3 కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూల్ ఉండగా మరో నూతన ప్రాధమికొన్నత పాఠశాల నిర్మాణం సాధ్యపడదని ఎం ఇ ఓ చెప్పారు. తాము మచిలీపట్నం ఆర్టీసీ బస్సులలో మచిలీపట్నం హైస్కూళ్లకు వెళుతుంటే కొందరు ఆకతాయిలు మాటలతో చేష్టలతో నిత్యం వేధిస్తున్నారని కొందరు బాలికలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సరైన పెంపకం లేకపోవడం , బూతు వెబ్సైట్లు, అశ్లీల సినిమాలు, విలువల పతనం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటి అంశాలపై అందరూ దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని ఈ దిశగా ప్రయత్నాలు చేయాలంటే ఇళ్లలో తల్లిదండ్రులు, బడుల్లో టీచర్లు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలు..ఇలా ఎవరికివారు బాధ్యత తీసుకుంటేనే యువతను ఈ దొరణల నుంచి తప్పించడం సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం మచిలీపట్నం తాలూకా ఎస్ ఐ కు మంత్రి ఫోన్ చేసి పల్లె తుమ్మలపాలెం నుంచి మచిలీపట్నం వరకు స్కూల్ సమయాలలో వెళ్లే వచ్చే బస్సులో విద్యార్థినులతో తరచూ ప్రయాణించి ప్రయాణ సమయంలో వెకిలివేషాలు వేసే పోకిరిగాళ్లకు గుర్తించి తగిన గుణపాఠం నేర్పాలని సూచించారు. బాలికా విద్య పట్ల , డ్రాఫౌట్స్ పట్ల శ్రద్ధాసక్తి చూపి తిరిగి వారు చదువుకోనేలా కృషి చేస్తున్న క్రాసా స్వచ్ఛంద సేవా సంస్థ పని తీరుని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. బాల బాలికలను తన వద్దకు అంత దూరం నుంచి ఆటోలలో తీసుకువచ్చి తమ తమ సమస్యలను చెప్పేలా వారికి దైర్యం కల్పించిన క్రాసా స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులను అభినందించారు. ఆటోలకు ఎంత ఖర్చు అయిందని ఉద్యోగిని జి. మేరీ గ్రేసీ అడిగారు. ఆమె 600 రూపాయలు అయిందని జవాబిచ్చారు. దాంతో మంత్రి ఆమె గూగుల్ పే నెంబర్ అడిగి ఆటో డబ్బుల ఖర్చు కింద 2 వేల రూపాయలు పంపించి అదనంగా నగదు ఎందుకు ఇస్తున్నానంటే పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినపుడు మరలా నా వద్దకు తీసుకురావడానికి దారి ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అని అన్నారు.
తనది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం అని ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నానని ఇటీవల బస్సు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతుంటే, ఒక ప్రయాణికుడు ఫోటో తీసి తమ ఉన్నతాధికారికి పంపడంతో తనను సస్పెండ్ చేశారని తిరిగి తన ఉద్యోగం వచ్చేలా సహాయం చేయాలనీ మంత్రిని ఒక వ్యక్తి కోరాడు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం.. బస్సులోని 50 మంది ప్రాణాలు అంటే నీకు నిర్లక్ష్యం కదా..మీ ఉన్నతాధికారి చేసింది ఏమీ తప్పు కాదని మంత్రి పేర్ని నాని ఆ అధికారి చర్యను సమర్ధించారు.
మచిలీపట్నం మండల పరిధిలోని బొర్రపోతుపాలెం మాజీ సర్పంచ్ నట్టే ప్రసాద్ మంత్రి పేర్ని నానిను కలిసి దాళ్వా సాగు విషయమై అడిగారు. స్పందించిన మంత్రి ఈ ఏడాది దాళ్వా లేదని అపరాల సాగుకు సిద్ధం కావాల్సిందిగా సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *