మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు హెచ్చరికల నేపథ్యం లో 17వ తారీఖు సాయంత్రం నాటికి ఒక స్పష్టత రానుందని, ఆయా వాతావరణ పరిస్థితులను18 వ తేదీన సమీక్షించి 19 వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున మంగినపూడి సముద్రస్నానాలకు వచ్చే సందర్శకు లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మచిలీపట్నం ఆర్డిఒ ఎన్ఎస్ కె. ఖాజావలి పేర్కొన్నారు.
సోమవారం ఆయన తన కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో జరిగే సముద్ర స్నానాలను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చక చక పూర్తవుతున్న వేళ వాతావరణం అనుకూల పరిస్థితులను తారుమారు చేసిందన్నారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సమాచారం తెలియచేసే ఉద్దేశ్యంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అండమాన్ తీర ప్రాంతానికి సమీపంలో మధ్య బంగాళాఖాతంలో సోమవారం తాజాగా అల్పపీడనం ఏర్పడిందని క్రమంగా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అనంతరం ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణించి ఈ నెల 18వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతం, కోస్తాజిల్లాలను సమీపిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారన్నారు. ఈ క్రమంలో ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతుందని, తుఫాన్గా రూపాంతరం చెందడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని ఆర్డీవో అన్నారు.ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 17వ తేదీ నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు హెచ్చరికలను జారీ చేశారని వివరిస్తూ వివిధ శాఖల అధికారుల కొర్ కమిటీతో మంగినపూడి బీచ్ వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన సోమవారం ఉదయం చేసినట్లు తెలిపారు. బీచ్ పార్కింగ్ ప్రదేశం, దుకాణ సముదాయాల సమీపం, దుస్తులు మార్చుకొనే గదులు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో నీరు నిల్వ ఉండి ఎటూ ప్రవహించని స్థితిలో ఉందన్నారు. అయితే మోటార్ల సహాయంతో అక్కడ నీటిని తోడించినప్పటకీ, మరల వర్షం కురిసి ఆ ప్రాంతంలో నీరు నిలిచిపోతుందన్నారు. భక్తులందరికి తమ విజ్ఞప్తి ఏమిటంటే, వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలను మీ ఇళ్లకు సమీపంలోని దేవాలయాలలో నిర్వహించుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడరాదనే ఉదేశ్యంతో ఈ సూచన తెలియచేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్డీవో సూచించారు. మంగళవారం 16 వ తేదీ మచిలీపట్నం పురవీధులలో జరిగే పాండురంగ స్వామి రధోత్సవంకు ఎటువంటి ఆటంకం లేదని ఆ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి తెలిపారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎం పి డీ ఓ డ్వామా పి డి జి. సూర్యనారాయణ, మచిలీపట్నం డి ఎస్పి మాసుం బాషా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News