న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 అంతర్జాతీయ ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్‌ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశ హస్తకళలు దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తకళల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందజేస్తున్నారు, ఈ మధ్య కాలంలో జరిగిన హస్తకళా మహోత్సవంలో హస్త కళాకారులకు వైద్య సేవలు 24 గంటల్లో అందిచండం తన దైన శైలినీ ప్రదర్శించారు. హస్త కళాకారులు పై తనకున్న అంకితభావాన్ని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలంకారీ, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక కళాఖండాలు వంటి విశిష్ట హస్తకళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. భారత్ టెక్స్–2026 వంటి అంతర్జాతీయ వేదికల ద్వారా రాష్ట్ర హస్తకళలను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయడంతో పాటు కళాకారులకు కొత్త వ్యాపార అవకాశాలు, ఎగుమతి అవకాశాలు విస్తరించే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ రాష్ట్ర హస్తకళల మార్కెటింగ్, బ్రాండ్ ప్రచారం, కళాకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం హస్తకళా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కళాకారుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక డిజైన్‌లు, డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ అనుసంధానం, ఎగుమతుల విస్తరణ వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ చేపడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల గొప్పతనాన్ని దేశ, విదేశీ సందర్శకులకు మరింత చేరువ చేయడంతో పాటు కళాకారులకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించేందుకు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు డా. పసుపులేటి హరిప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా భారత్ టెక్స్–2026 ఎక్స్‌పోలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్ దేశీయ, విదేశీ కొనుగోలుదారులు, వ్యాపార ప్రతినిధులు, సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.
Prajavartha Online Telugu News