Breaking News

43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు

-2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు
-95 వేల నుంచి భారీగా పెరిగిన పంపిణీ లక్ష్యం
-రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
-మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. జూలై 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 18 ఏళ్ల విద్యార్థులందరినీ పరీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా దీన్ని అమలు చేస్తాయన్నారు. కళ్లద్దాలు పంపిణీకి సుమారు రూ. 7 కోట్ల వరకు వ్యయమవుతుందని తెలిపారు

పథకం అమలు సంతృప్తికరంగా ఉన్నందున…

గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 95 వేల ఉచిత కళ్లద్దాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని 2.50 లక్షలకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, ఆమోదం కోసం కృషి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో కంటి అద్దాల పంపిణీ సంతృప్తికరంగా ఉండడంతో కేంద్ర ఆమోదం తెలిపిందని చెప్పారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందిస్తామన్నారు. తదుపరి వైద్యం అవసరమైన వారిని ప్రభుత్వ నేత్ర వైద్యశాలలు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వం గుర్తించిన స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రులకు పంపించి చికిత్స చేయిస్తామని తెలిపారు. చిన్న వయస్సులోనే కంటిచూపు సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తే విద్యార్థుల చదువు, ఏకాగ్రత, మానసిక వికాసం మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. దృష్టిలోపం కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకుండా చూడడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. కంటి పరీక్షలు ప్రతి విద్యార్థికి జరిగేలా జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యక్రమానికి సహకరించాలని కోరారు. నివారించగల అంధత్వాన్ని అరికట్టి, ప్రతి విద్యార్థికీ మెరుగైన కంటిచూపు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోలవరానికి పర్యాటక శోభ

-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *