నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి విజ్ఞప్తులను ఆర్డీఓ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం సీతారామపురంనకు చెందిన జక్కం అంజమ్మ తన కొడుకు ముసలి వయస్సులో తనను చూడకుండా నిరాదరణకు గురిచేయడంతోపాటు పలు బాధలు పెడుతున్నాడని వాపోయింది. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తల్లితండ్రుల పరిరక్షణ బాధ్యత వారికి పుట్టిన బిడ్డలదేనని, తల్లితండ్రులను నిరాధరణకు గురిచేసే బిడ్డలపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామన్నారు. ఆగిరిపల్లి తహశీల్దారుకు ఫోన్ చేసి సమస్యని పరిశీలించి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో 05 ధరఖాస్తులు అందాయని ఆర్.డి.ఓ తెలిపారు.
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో 2016 నుండి 2019 వరకు క్రాంతి గ్రామ సమైఖ్య సంఘం ద్వారా ఎఫ్.ఎ. ద్వారా మరుగు దొడ్లు కట్టియున్నారని, కొంత మందికి బిల్లులు ఇచ్చారని చాలా మందికి బిల్లులు మంజూరు చేయలేదని అయినా అధికారులు మరుగుదొడ్లు కట్టించకుండా కట్టినట్లు దొంగ బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసికున్నారని వీరిపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరుతూ తూర్పు దిగవల్లి గ్రామస్ధులు ఒగ్గు రవీంధ కొంత మంది కలిసి అర్జీ అందజేశారు.
గన్నవరం మండలం ముస్తాబాదు గ్రామ శివారు వెదురుపావులూరు గ్రామ రైతులు కొందరు వెదురుపావులూరు గ్రామంలో 2020 ఏప్రిల్ నెలలో ఇండ్ల పట్టాల నిమిత్తం పేద, సన్నకారు రైతు వ్యవసాయ కూలీలు వారికి చెందిన భూమిని ప్రభుత్వం వారికి ఇచ్చియున్నారని అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు కావస్తున్న ప్రభుత్వానికి ఇచ్చిన భూమి నిమిత్తం ఇప్పటికి తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి డబ్బులు తమ ఖాతాల్లోకి జమ అయ్యేలా చూడాలని కోరుతూ అర్జీ అందజేశారు.
నూజివీడు మున్సిపల్ మాజీ కౌన్సిలరు చలమాల వెంకటేశ్వరరావు నూజివీడు ఆర్.టి.సి. బస్సు స్టేషన్ లోని ప్లాట్ ఫారాల వద్ద గత కొద్ది నెలలుగా లైట్లు వెలగక ప్రయాణికులు అనేక ఇబ్బందులుకు గురి అవుతున్నారని బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చీకటిగా ఉండుట వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వాస్తవాలు తెలుసుకొని బస్టాండ్ ఆవరణలో లైట్లు వెలిగేలా చెయ్యాలని కౌన్సిలరు అర్జీ అందజేశారు.
ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామ నివాసి నల్లమోతు విజయనిర్మల నెక్కలం గొల్లగూడెం గ్రామంలో వారసత్వ బహుమానంగా సంక్రమించిన ఆర్.ఎస్. నెం. 137/7లో య. 0.23 సెంట్ల నివేశన స్ధలం తమ స్వాధీనంలో ఉన్నదని కాని తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేరున ఆగిరిపల్లి మండలం తహశీల్దారు కార్యాలయంలో మార్పులు చేసి అడంగళ్ లో నమోదు చేశారని, కావున వీరిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని కోరతూ అర్జీ అందజేశారు.
స్పందనకు హాజరుకాని అధికారులపై చర్యలు: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి హెచ్చరిక.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందన కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ, ఐ సీడీస్, వ్యవసాయం, ఉద్యానవనాలు, హౌసింగ్, పశుసంవర్ధకం, ఆర్ డబ్ల్యూ ఎస్, రోడ్లు భవనాలు, తదితర ముఖ్యమైన శాఖల సిబ్బంది గైరుహాజరవడంపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంపై వివరణ కోరుతూ మెమో జారీ చేయాలని, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ వారికి తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ నివేదిక
సమర్పిస్తామని ఆర్డీఓ చెప్పారు. కొంతమంది అధికారులు తాము హాజరు కాకుండా ముందస్తు అనుమతి లేకుండా కిందస్థాయి స్థాయి సిబ్బందిని స్పందన కార్యక్రమానికి పంపుతున్నారని, ఇది చాలా శోచనీయమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అధికారులపై శాఖపరమైన చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుందని ఆర్డీఓ హెచ్చరించారు.
స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసరు కె. భాస్కరరావు, వైద్యాధికారిణి డా. పి. అనూష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News