-మున్సిపల్ కమిషనర్‌కు తెదేపా కార్పోరేటర్ల విజ్ఞప్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అపరిష్క్రతంగా ఉన్న టిడ్కో ఇళ్ల కేటాయింపుపై నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. 11వ డివిజన్ కార్పోరేటర్ కేశినేని శ్వేత నేతృత్వంలో టీడీపీ కార్పోరేటర్ల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంరద్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా టిడ్కో ఇళ్లకు డిపాజిట్ చెల్లించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైయినేజీ పన్నులు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలతో పాటు అద్దెదారుల ఆర్ధిక పరిస్థితి కూడా తల్లక్రిందులవుతాయని చెప్పారు. ఈ విషయంలో కమిషనర్ నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం తమ బాధ్యతను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిష్పక్షపాతంగా అన్ని డివిజన్ల అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్‌లో నగరాన్ని ప్రధమ స్థానంలో నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కార్పోరేటర్లు సూచించిన అంశాలను పరిశీలించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని కేశినేని శ్వేత తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో కార్పోరేటర్లు జాస్తి సాంబశివరావు, వీరమాచనేని లలిత, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, వల్లభనేని రాజేశ్వరి, సాయిబాబా, ఉమ్మడి చంటి, నెలిబండ్ల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.