-నిర్థేశించిన గడువులో భవన నిర్మాణాలను పూర్తి చేయాలి…
-జిల్లాకలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు మంజూరైన 767 ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలలో 241 నిర్మాణాలను పూర్తి చేశామని మిగిలిన 526 భవనాలను నిర్మాణ ఎజెన్సీల సమన్వయంతో సెప్టెంబర్ మాసాంతంలోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి యంపిడివోలు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ. వెంకటేశ్వరరావు, ఆ శాఖ వివిధ స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 268 గ్రామసచివాలయల భవనాలు, 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 260 రైతుభరోసా కేంద్రా భవనాలను ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్ మాసాంతంలోగా పూర్తి చేయాల్సిన భాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఇప్పటి వరకు 72 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 25 గ్రామ సచివాలయల భవనాలు,68 రైతుభరోసా కేంద్రాల పనులు బేస్మెంట్ లెవల్‌లోఉన్నాయని, ఇంకనూ 42 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 12 గ్రామ సచివాలయల భవనాలు,32 రైతుభరోసా కేంద్రాల పనులను ప్రారంభించవలసి ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల ప్రాముఖ్యతను గుర్తించి 14.46 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబరు మాసాంతానికి భవన నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకుని ఆచరణలో పెట్టాలని కలెక్టర్ తెలిపారు. జూలై రెండవ పక్షంలో 43 భవనాలు, ఆగస్టు మాసం మొదటి పక్షానికి 69, రెండవ పక్షానికి 145 భవనాలు, సెప్టెంబరు మాసం మొదటి పక్షానికి 95, రెండవ పక్షంలో 147 భవనాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించాలని నిర్మాణ పనుల భాధ్యతలను తీసుకున్న ఎజెన్సీల సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. పనుల వేగవంతానికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, స్టీల్, ఇసుక, కంకర వంటి నిర్మాణ సామాగ్రి సిద్దంగా ఉన్నాయన్నారు. మండల ప్రజా పరిషత్ రెవెన్యూ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వ్యవసాయ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నాణ్యత ప్రమాణాలతో ప్రభుత్వ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
Prajavartha Online Telugu News