గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్ లు పనులు వేగంగా చేపట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని, రోడ్ల విస్తరణ పనులు చేపట్టిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, తదితర అంశాల పై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి కావాలని, అందుకు తగిన విధంగా పనులు వేగవంతం కోసం ఈ.ఈ.లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు పూర్తి అయిన ప్రాంతాల్లో డ్రైన్ పనులు ప్రారంభించాలన్నారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుంటూ స్తంభాలు షిఫ్టింగ్, డ్రైన్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏ.ఈ.లు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. గాంధి పార్క్ నగరంలో ఎంతో కీలకమైనదని, పార్క్ పనులు కొంత కాలంగా మందకొడిగా సాగుతున్నాయని, సదరు కాంట్రాక్టర్ ని పిలిపించి ఎస్.ఈ., ఈ.ఈ.లు మాట్లాడి పనులు వేగవంతంకు చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు. వీధి లైట్ల మీద నగరపాలక సంస్థ కాల్ సెంటర్ కు ప్రతిరోజు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించి, ఏ.ఈ.లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలో ప్రధాన మరియు అంతర్గత రహదార్ల వెంబడి, నగరపాలక సంస్థ స్థలాలల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని, జంక్షన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని ఏ.డి.హెచ్.ని ఆదేశించారు.
అంతరం పట్టణ ప్రణాళిక అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మీడియా డివైస్ డిస్ప్లే ఫీజు వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి వారం సమీక్షలో ఫీజు చెల్లించిన వారి వివరాలు, బకాయిదార్ల హోర్డింగ్స్, బోర్డ్ల వివరాలు తమకు అందించాలని ఆదేశించారు. విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణ సమయాల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. డొంక రోడ్ లో పెండింగ్ లో ఉన్న విస్తరణ పనుల వేగావంతంకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో ఈ.ఈ.లు కొండారెడ్డి, శాంతి రాజు, సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, ఏ.డి.హెచ్. రామారావు, ఏపిసిపిడిసిఎల్ ఈ.ఈ. శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పిలు, టి.పి.ఎస్.లు, ఏపిసిపిడిసిఎల్ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News