గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేందుకు 800 డయా పైప్ లైన్ నుండి 900 డయా పైప్ లైన్ కు మార్చే ప్రక్రియలో భాగంగా చేపట్టనున్న ఇంటర్ కనెక్షన్ పనుల వలన గోరంట్ల, నగరాలు ప్రాంతాలకు ఈ నెల 22 నుండి 28 (బుధవారం నుండి వచ్చే మంగళవారం) వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్.ఎల్.ఆర్.కు త్రాగునీరు సరఫరా ప్రస్తుతం 800 ఎం.ఎం.డయా పి.ఎస్.సి.పైప్ లైన్ ద్వారా జరుగుతుందని, దాని స్థానంలో మెరుగైన త్రాగునీరు అందించేందుకు 900 ఎం.ఎం.డయా పైప్ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద పాత లైన్ నుండి నూతన లైన్ కు ఇంటర్ కనెక్షన్ పనులు 22 వ తేదీ (బుధవారం) ఉదయం సరఫరా తర్వాత చేపట్టనున్నామన్నారు. దీనివలన గోరంట్ల, నగరాలు లోని పలు ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని, త్రాగునీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు. ట్యాంకర్లు కావల్సిన వారు 98499 08397 నంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు. అలాగే ఇంటర్ కనెక్షన్ పనుల వలన నెహ్రూ నగర్ నుండి సంజీవయ్య నగర్ కు వెళ్లే వాహనాలు మూడు వంతెనల మీదుగా, రెడ్డిపాలెం నుండి వచ్చే వాహనాలు శారదా కాలనీ మెయిన్ రోడ్ మీదుగా వెళ్ళేలా ట్రాఫిక్ కూడా మళ్ళించడమైనదని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని, ఎక్కడా త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టిన పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులకు నగర ప్రజలు సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News