-భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
-ఆంధ్రప్రదేశ్ తెలుగు మాండలిక భాషల సంస్కృతి సంప్రదాయాలు సమ్మేళనం
-యువత దేశానికి వెన్నెముక
-మనం చేపట్టే ప్రతి పనిలో మానవీయ కోణం ఉండాలి:కలెక్టర్
ఏర్పేడు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని, ఆంధ్రప్రదేశ్ విభిన్న మాండలిక భాషల సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం అని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు అందరూ తెలుసుకునేలా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది అని ఐ. ఐ. టి. తిరుపతి లో యువసంగం సహకారం ఎంతో అభినందించదగినదని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు.
మంగళవారం ఏర్పేడు ఐఐటి నందు ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి కి 24 ఫిబ్రవరి నుండి మార్చి1 వరకు క్షేత్ర స్థాయి పర్యటనకు విచ్చేసిన 28 మంది ఉన్నత స్థాయి విద్యార్థుల బృందం మరియు వారి అధ్యాపకులతో ముఖా ముఖిలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువ సంగం ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ యాత్రలో భాగంగా దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులు , సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై అన్ని ప్రాంతాల వారికి తెలియజేయాలనీ, అందులోని మంచి అనుభవాలను గ్రహించి వారి రాష్ట్రాలలో వారి ప్రాంతాలలో వాటిని అమలు చేసే విధంగా వుండాలని అన్నారు. విభిన్న రంగాలలో సుస్థిర అభివృద్ధి సాధించే దిశలో ఉపయోగపడే అంశాలను అమలు చేసి ఆ ప్రాంత ప్రజల సమాజ అభివృద్ధికి దోహదం చేసే గొప్ప ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, భారత ప్రజల మధ్య విభిన్న మాటలు, కులాలు, భాషలు ఉన్నా కూడా వారి మధ్య సుహృద్భావ ఐకమత్యాన్ని పెంపొందించే దిశలో ఈ బృహత్తర కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు.
మన రాష్ట్రానికి చెందిన యువత ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన యువత మన రాష్ట్రానికి వచ్చి ఆచారాలు, సంప్రదాయాలు, చరిత్ర తెలుసుకోవడం ద్వారా మన భారతదేశం గొప్పతనం, విభిన్న సంస్కృతులు కలిగి భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కొండ ప్రాంతాలు మెట్ట తదితర అంశాల సమ్మేళనం అని, మన దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఎంత గొప్ప చరిత్ర, సంస్కుత్రి, సంప్రదాయాలు ఉన్నాయో తెలుసుకోగలుగుతారని వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలుగు భాషలో విభిన్న మాండలిక భాషలతో రాయలసీమ, కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల సమూహమని 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగి పలు ఓడరేవులు కలిగినదని అన్నారు. రాష్ట్రంలో సాధారణంగా ఉండే విశ్వ విద్యాలయాలతో పాటు ప్రత్యేకమైన వేదిక్ విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఉన్నాయని అన్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైన చంద్రగిరి కోట ఒక గొప్ప పురాతన చారిత్రాత్మక కట్టడం అని, శ్రీ సిటీ ఒక్క పారిశ్రామిక వాడలోనే 28 దేశాలకు చెందిన 200 పరిశ్రమలు పైగా ఉన్నాయని, రేణిగుంట విమానాశ్రయం సమీపంలో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని తిరుపతి- విశాఖపట్నం- విజయవాడ ప్రాంతాలలో పలు పారిశ్రామిక హబ్ లు ఏర్పడి వీటన్నింటిలో అనేక వేల మంది నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యం కలవారికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబడుతోందని అన్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాటలను గుర్తు చేసుకుంటూ జాతీయ సమైక్యత విద్యతోనే సాధ్యమని గుర్తించాలని కోరారు. సుస్థిర సమగ్ర అభివృద్ధి అన్ని రంగాలలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలైనప్పుడే సాధ్యమని, దానిని సాధించడానికి ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎంతో దోహదం చేస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏడు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చే విధంగా వారి నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి గిరిజన ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు వసతి, ఆసుపత్రిలో ప్రసవం కల్పించుట, గిరిజన సంక్షేమ హాస్టల్లు, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించి వారి అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, అటువంటి ప్రాంతాలను సందర్శించి వాటిలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేసిన అంశాలను, అనుభవాలను ఆకలింపు చేసుకొని తమ రాష్ట్రాలలో తమ ప్రాంతాలలో వాటిని అమలు చేసి పేదవారి అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. మనం చేసే పనిలో మానవత్వం , మానవీయకోణం తప్పక ఉండాలని అప్పుడే మనకు ఆత్మ సంతృప్తి కలుగుతుందని, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, భారతదేశానికి యువతనే వెన్నెముకని తెలుపుతూ సుస్థిర అభివృద్ధి అనేది పర్యావరణ హితంగా ఉండాలని అన్నారు.
క్షేత్రస్థాయిలో మీ యొక్క అనుభవాలను పరిశీలనలను సలహాలను ఒక ప్రాజెక్టు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసి పేదల అభ్యున్నతికి ఉపయోగపడేలా, ఒక దిక్సూచి లా ఉండాలని అప్పుడే ఈ కార్యక్రమానికి సాఫల్యత చేకూర్చిన వారు అవుతారని అన్నారు.
ఐ ఐ టి సంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో 1953వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, నేడు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు ఏర్పాటుతో తిరుపతి జిల్లా కలెక్టర్ గా వెంకటరమణారెడ్డి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తిరుపతి జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయము ఇతర ప్రముఖ ఆలయాలు కలిగి, పరిశ్రమలు, వివిధ రవాణా సౌకర్యములు కలిగిన ప్రాంతమని అనేక మంది వివిధ ప్రాంతాల రాష్ట్రాల పర్యాటకులు ప్రముఖులు సందర్శన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం ఉత్తర భారత దేశం నుండి దక్షిణ ప్రాంతాల పర్యటనలతో ఏకత్వం సమైక్యత సాధన దిశగా ఏర్పడిందని అన్నారు. తిరుపతి ప్రాంత ప్రత్యేకతలు, చరిత్ర, సంప్రదాయాలన్నింటినీ ఇతర రాష్ట్రాల వారు తెలుసుకునేలా ఈ ఏక్ భారత్ శ్రేష్ట భారత యువ సంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థులు మరింత విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలని, నూతన ఆవిష్కరణలకు ఇలాంటి యాత్రలు ఉపకరిస్తాయని అన్నారు.
ఇందులో అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం వెంకటేశ్వరుని ప్రతిమను కలెక్టర్ ఐఐటి డైరెక్టర్ తో కలిసి ఈ బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటి కాలేజ్ సిబ్బంది, యువ సంగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News