-ఎం ఎల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు నిబంధనల మేరకు ఉండాలి: జిల్లా కలెక్టర్
శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం ఎల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు నిబంధనల మేరకు ఉండాలని మరోమారు సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాళహస్తి, స్కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను మరియు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ లోని 17 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలకు గాను 51 బ్యాలెట్ బాక్సులు 8 ఉపాధ్యాయ పోలింగ్ స్టేషన్లకు గాను 16 బ్యాలెట్ బాక్సులు వెరసి మొత్తం 67 బ్యాలెట్ బాక్సులు మరియు రిజర్వులో 40 అందుబాటులో ఉన్న బ్యాలట్ బాక్సులను పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ తదితర సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కొరకు కళాశాలలో కనీస వసతులైన తగినంత లైటింగ్, బ్యారికేడింగ్, మరుగుదొడ్లు, త్రాగునీరు, టేబుల్, చైర్లు ఏర్పాట్లు సరిపడా ఉండాలని , భద్రతాపరమైన అంశాలు నిబంధనల మేరకు ఏర్పాటు కావాలని అన్నారు. శ్రీకాళహస్తి డివిజన్ కు సంబంధించి ఐదు రూట్లలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లకు సెక్టోరియల్ అధికారులను అనుసంధానం చేశామని అన్నారు. ప్రశాంతంగా ఎం ఎల్సి ఎన్నికల నిర్వహణకు గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శ్రీకాళహస్తి డివిజన్ నందు 10 పోలింగ్ స్థానాలలో బందోబస్తు, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు, బ్యారికెడింగ్ , తగినంత సిబ్బంది ఉండాలని సూచించారు. అంతే కాకుండా పోలింగ్ కేంద్రంలో ఓటర్ స్లిప్ మరియు అందుకు సంబంధించిన ఓటర్ గుర్తింపు కార్డు/ పత్రం మాత్రమే అనుమతి చేయబడుతుందని ఎట్టి పరిస్థితులలో పెన్నులు, పెన్సిల్, పేపర్లు, సెల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తదనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలు, అనుసంధాన పోలింగ్ కేంద్రాల వద్ద తగినన్ని మార్క్డ్ ఓటర్ల జాబితా, వర్కింగ్ జాబితాలు అందుబాటులో ఉంచుకోవాలని, బి ఎల్ ఓ లు ఓటర్ల స్లిప్పులు సదరు ఓటరుకు అందేలా చూడాలని , తహశీల్దార్లు బి ఎల్ ఓ ల ద్వారా ఓటర్ స్లిప్పులు అందించేలా పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మరియు ఏ ఈ ఆర్ ఓ శ్రీకాళహస్తి జరీన, మునిసిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎంపిడిఓ ప్రేమ్ రాజ్ కుమార్, మండల సర్వే అధికారి, స్కిట్స్ కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News