-సీఎం జగన్ పాలనలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58, 60, 63 డివిజన్ల పరిధిలో రూ. 80 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించారు. తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. డివిజన్ల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని మరీ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో రహదారులను సైతం విస్తరించి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా 58 వ డివిజన్ లో రూ. 40 లక్షలతో కర్నాటి బిల్డింగ్ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే రాజీవ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రూ.20 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాంబేకాలనీ A బ్లాక్ అపార్ట్మెంట్స్ వద్ద రూ. 19.97 లక్షలతో నూతన రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు.
-ఏ ముఖం పెట్టుకుని పర్యటనలు చేస్తారు
అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజల ముఖం చూడని గత పాలకులు.. మరలా ఏముఖం పెట్టుకుని డివిజన్ పర్యటనలు చేస్తున్నారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 58వ డివిజన్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భరతమాత మందిరం ఏరియాలో రూ. కోటి 80 లక్షలతో 2.40 కి.మీ. రహదారులను నిర్మించినట్లు తెలిపారు. జనరల్ ఫండ్స్ తో తోటవారి వీధి, USR స్ట్రీట్, షణ్ముఖసాయి నగర్, జ్యుడిషియల్ కాలనీ, జమ్మిచెట్టు సెంటర్, ఆర్.ఆర్.పేట ప్రధాన రహదారి పనులను చేపట్టి పూర్తిచేయడం జరిగిందన్నారు. అలాగే ఈ ప్రాంత ప్రజల శాశ్వత మంచి నీటి పరిష్కారానికి వై.వి.రావు ఎస్టేట్లో రూ.4.83 కోట్లతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఏడాది చివరి నాటికి పూర్తి వినియోగంలోకి తీసుకువస్తామని తెలియజేశారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే.. వాస్తవాలను వక్రీకరించడం పచ్చమీడియాకు తగదని మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్లో 3,700 వాటర్ కనెక్షన్లు ఉన్నాయని.. ఒక్కో వ్యక్తికి సరాసరిన రోజుకు 135 లీటర్ల రక్షిత నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సైతం త్రాగునీటి వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. కనుక తప్పుడు కథనాలను వండివార్చడం మానుకోవాలని ఎల్లో మీడియాకు సూచించారు. పేద ప్రజలు నివసించే వాంబేకాలనీపైనా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. రూ. 3 కోట్లతో నిర్మించిన ప్రధాన రహదారే ఇందుకు నిదర్శనని మల్లాది విష్ణు అన్నారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు తీర్చే దిశగా ఈ ప్రభుత్వం పని చేస్తుంటే, ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News