మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో డిఆర్ఓ పి. వెంకటరమణ తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టరేట్ సుందరీకరణ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లా కేంద్రం మచిలీపట్నం అయినప్పటికీ పెద్దగా పట్టించుకునేవారు కాదని, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలెక్టరేట్ లోకి అడుగుపెడితే ఒక మంచి భావన కలిగే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ఇందుకోసం కలెక్టరేట్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. వర్షం పడితే గుంటల్లో, తగ్గు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి ఇబ్బందికరంగా ఉందని ఆ ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా మట్టితో పూడ్చి వేయాలన్నారు. కలెక్టరేట్లో కురిసే వర్షపు నీరు సరైన మార్గంలో ప్రవహించి బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కార్యాలయానికి వెళ్లేందుకు సరైన అంతర్గత రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్ లోని ఆస్తులన్నీ భద్రంగా ఉండాలంటే చుట్టూ ప్రహరీ అన్ని విధాలా పటిష్టంగా బాగుండాలన్నారు.
ప్రధాన ప్రవేశ మార్గం వద్ద ఒక హోంగార్డును నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ సుందరీకరణలో భాగంగా పచ్చని తోట, వచ్చిన ప్రజలు కూర్చోవడానికి సౌకర్యంగా బల్లలు, సరైన పార్కింగ్ ప్రదేశాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లో ఒక కాన్ఫరెన్స్ హాలు నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై కలెక్టరేట్ లోఅభివృద్ధి పనుల గురించి సమీక్షించడం జరుగుతుందన్నారు. అలాగే రహదారులు భవనాల అతిథి గృహంలో కూడా సుందరంగా తీర్చిదిద్దాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. కలెక్టరేట్కు వచ్చే మార్గంలో ఉన్న దెబ్బతిన్న బాల భవన్ భవనాన్ని పడగొట్టేయాలన్నారు. ఈ సమావేశంలో డిపిఓ నాగేశ్వర్ నాయక్, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ ముడా విసి రాజ్యలక్ష్మి, ఉద్యాన అధికారి జ్యోతి, డిటిసి సీతాపతి రావు, ఆర్ అండ్ బి ఇంజనీర్ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, డీఎల్డీవో సుబ్బారావు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News