– మసీదుల వద్ద ట్రాఫిక్, భద్రత తదితరాలపై ప్రత్యేక దృష్టి
– తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు
– జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని.. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 11న చంద్ర దర్శనం ఆధారంగా పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మతపెద్దలతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని.. మత పెద్దల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. మసీదుల వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అవసరం మేరకు బ్యారికేడింగ్ చేయడంతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా తదితరాలపైనా ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రతి మసీదు వద్ద అవసరం మేరకు పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పెద్ద, చారిత్రక మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ముఖ్యమైన రోజులు, జాగారం సమయాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వివరించారు. సమావేశం సందర్భంగా మత పెద్దలు పలు సూచనలు చేశారు. సమావేశంలో విజయవాడ, నందిగామ ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, ఎ.రవీంద్ర, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షంసున్నీసా బేగం, డీపీవో జయచంద్రగాంధీ, విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ఎ.మహేష్, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఎఫ్‌వో ఏవీ శంకరావు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News